
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కేసుల్లో నిలకడ కనిపిస్తుందని, రికవరీ రేటు మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. కరోనా మహమ్మారిపై గెలుపు దిశగా భారత్ పయనిస్తోందని, కోవిడ్-19ను మట్టికరిపించడంలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ 10,000 మంది కోవిడ్-19 రోగులు కోలుకున్నారని చెప్పారు. ఈ మహమ్మారి నుంచి పెద్దసంఖ్యలో కోలుకునే రోగుల సంఖ్య పెరుగుతోందని, వైరస్ నుంచి కోలుకుని వారు ఇంటికి వెళుతున్నారని తెలిపారు.
తాజా కేసుల సంఖ్య సైతం నిలకడగా ఉందని, కేసులు రెట్టింపయ్యేందుకు పట్టే సమయం కూడా మెరుగవుతోందని వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ పది లక్షలకు పైగా కరోనా టెస్ట్‌లు నిర్వహించామని, రోజుకు 74,000 పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశమంతటా దాదాపు 20 లక్షల పీఈపీ కిట్లను వైద్య సిబ్బందికి అందచేశామని చెప్పారు. వంద దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్వీన్, పారాసిటమాల్ మాత్రలను సరఫరా చేశామని తెలిపారు. కోవిడ్-19 బాధితులు, వైద్యుల పట్ల వివక్ష చూపరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment