న్యూఢిల్లీ : కేంద్రంలో వరుసగా రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా మరో 57 మంది కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మోదీ 2.0 కేబినెట్‌గా పిలుచుకుంటున్న ఈ మంత్రివర్గంలో దాదాపు 39 శాతం నేర చరిత్ర గలవారేనని.. ఎన్నికల సమయంలో వారు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా స్పష్టమవుతోంది. వీటి ఆధారంగా మోదీ ప్రభుత్వంలోని 22 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా వెల్లడించారు. వీరిలో 16 మందిపై ఉగ్రవాదం, హత్య, అత్యాచారం, దొంగతనం, మత ఘర్షణలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కిడ్నాపింగ్, దేశద్రోహం తదితర తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.
ఆ ఆరుగురు..వివాదాలకు కేరాఫ్!
ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో మంత్రులుగా చోటు దక్కించుకున్న ఆరుగురు నేతలపై మత విద్వేషాలను రెచ్చగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అమిత్ షా, ప్రతాప్ చంద్ర సారంగి, బాబుల్ సుప్రియో, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, ప్రహ్లాద్ జోషి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా.. భాష, జాతి, స్థానికత ఆధారంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణమయ్యారనే కేసులు నమోదయ్యాయి. అదే విధంగా ఒక మతం గురించి అవమానకరంగా మాట్లాడరనే ఆరోపణల కింద ఐపీసీ సెక్షన్-295ఏ ప్రకారం వీరిపై కేసులు నమోదు చేశారు.
చదవండి : కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు..ఎవరెవరికి ఏయే శాఖ
అక్రమ చెల్లింపుల ఆరోపణలు..
ఇక కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖా సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే, పశుసంవర్థకం, పాడి, మత్స్య శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌పై అక్రమ చెల్లింపులు, లంచం ఇవ్వజూపడం, ఎన్నికలను ప్రభావితం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీసీ సెక్షన్ 171హెచ్, 171ఈ, 171ఎఫ్ కింద కేసులు నమోదయ్యాయి.
51 మంది కోటీశ్వరులే...
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక ప్రకారం.. మోదీ జెంబో కేబినెట్‌లోని 91 శాతం అంటే 57 మందిలో 51 మంది మంత్రులు కోటీశ్వరులే. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ నిర్వహిస్తున్న హర్ సిమ్రత్ కౌర్ బాదల్ మంత్రులందరిలోనూ సంపన్నురాలిగా నిలిచారు. ఆమె మొత్తం ఆస్తి విలువ 217 కోట్ల రూపాయలు. కాగా రూ. 95 కోట్ల ఆస్తితో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సంపన్న మంత్రుల జాబితాలో రెండోస్థానంలో నిలిచారు. ఇక మోదీ కేబినెట్‌లోని మంత్రులందరి సగటు ఆస్తి విలువ రూ. 14.72 కోట్లుగా ఉంది. కాగా ఒడిశా మోదీగా గుర్తింపు పొందిన ప్రతాప్‌చంద్ర సారంగి అందరి కంటే తక్కువగా అంటే కేవలం రూ. 13 లక్షల ఆస్తి మాత్రమే కలిగి ఉన్నారు.
అన్ని వర్గాలకు సముచిత స్థానం
రెండోసారి ప్రధానిగా పదవి చేపట్టిన నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించారనే చెప్పవచ్చు. మోదీ కేబినెట్‌లో మొత్తంగా ఆరుగురు మహిళా మంత్రులు ఉన్నారు. మొత్తం 58 మందిలో 20 శాతం మంది అంటే 11 మంది మంత్రుల సగటు వయస్సు 41-50 సంవత్సరాలు. 45 మంది మంత్రులు 50- 70 ఏళ్లలోపు వయస్సు గలవారు. ఇక వీరందరిలో 84 శాతం మంది ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment