ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్‌కు చెందిన డేరా సచ్చ సౌదా గురించి సంచలన విషయాన్ని హర్యానా ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. ఆయన కేవలం డేరా బాబా మాత్రమే కాదని, కోట్ల ఆస్తులను గుర్మీత్ కలిగిఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. నేడు పంజాబ్, హర్యానా హైకోర్టుకు కట్టర్ ప్రభుత్వం సమర్పించిన నివేదికలో, డేరా సచ్చ సౌదా ఆస్తుల విలువ రూ.1,453 కోట్లుగా తెలిపింది. ఇవి కేవలం డేరా ప్రధాన కార్యాలయం సిర్సాలోనివేనని పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా గుర్మీత్ రామ్ రహీమ్ ఆర్గనైజేషన్‌కు సుమారు రూ.1600 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్టు కూడా వెల్లడించింది. హర్యానా వెలుపల డేరా కలిగి ఉన్న ఆస్తుల వివరాలను ప్రభుత్వం లెక్కకట్టలేదు. ప్రభుత్వం అంచనావేసిన దానికంటే అధికంగానే గుర్మీత్ డేరాకు ఆస్తులున్నట్టు కూడా వెల్లడవుతోంది.
సాధ్వీలపై అత్యాచార కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు విధించిన సమయంలో ఆయన అనుచరులు భారీ ఎత్తున్న అల్లర్లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లతో వచ్చిన నష్ట్రాన్ని పూరించడానికి డేడేరా సచ్చ సౌదా ఆస్తుల వివరాలను లెక్క కట్టాలని పంజాబ్, హర్యానా హైకోర్టులు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం వెల్లడించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.