సాక్షి, న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంప్రాంగణంలో జనవరి 5, ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేయనున్నారు. నేడు( శుక్రవారం)నాలుగు గంటలకు పోలీసులు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ముసుగులేసుకుని మరీ క్యాంపస్‌లో ప్రవేశించి, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై విరుచుకుపడిన దుండగుల వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయనున్నామని అలాగే వాట్సాప్ మిస్టరీని కూడా ఛేదించామని అధికారులు చెబుతున్నారు. జేఎన్‌యు క్యాంపస్‌లో అక్కడ ఉన్న వారి మొబైల్ ఫోన్‌ల డేటాను విశ్లేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హింస జరిగిన దాదాపు ఐదు రోజులకు సంఘటనను దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
మరోవైపు రెండు వాట్సాప్ గ్రూపులకు కనీసం 70 మంది నిర్వాహకులను గుర్తించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ పిటిఐ నివేదిక పేర్కొంది. కాగా ముసుగులేసుకున్న సుమారు 50 మంది జేఎన్‌యు క్యాంపస్‌లోకి కర్రలు, ఇనుప రాడ్‌లతో హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడి చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోషేతోపాటు, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటివరకు మొత్తం 14 ఫిర్యాదులను పోలీసులు నమోదు చేశారు. వీటన్నింటినీ క్రైమ్ బ్రాంచ్ పరిశీలిస్తోంది. అయితే ఈ ప్రకటనపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనవరి 5 దాడిలో గాయపడిన విద్యార్థి నాయకురాలు ఐషే ఘోషే పై కేసు నమోదు చేసిన తీరుగానే, పోలీసుల ప్రకటన వుండే అవకాశం ఉందా అని సందేహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment