బెంగళూరు : 5 స్టార్ హోటల్ రేంజ్ సదుపాయాలేం అక్కర్లేదు.. అవసరమైతే రోడ్డు మీద కూడా నిద్రపోగలను అంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి. శుక్రవారం నుంచి గ్రామాల్లో పర్యటన నిమిత్తం ‘గ్రామ వాస్తవ్య 2.0’ కార్యక్రమాన్ని యాద్గిర్ నుంచి ప్రారంభించారు కుమారస్వామి. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేయబోయే ఓ లాడ్జీలోని బాత్రూమ్‌ని రిన్నోవేట్ చేశారు అధికారులు. దాంతో విపక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి. సీఎం గ్రామ పర్యటన చాలా విలాసవంతంగా సాగుతుందని.. ఆయన కోసం 5 స్టార్ హోటల్ రేంజ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించాయి.
ఈ విమర్శలపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఓ చిన్న బాత్రూంను నిర్మిస్తే ప్రతిపక్షాలు ఇంతలా విమర్శలు చేస్తున్నాయి. రోజంతా పలు కార్యక్రమాల్లో పాల్గొని అలసిపోతాను. ఫ్రెష్ అవడానికి చిన్న బాత్రూం ఏర్పాటు చేశారు. అది కూడా తప్పేనా. దానికే 5 స్టార్ హోటల్ రేంజ్ ఏర్పాట్లు అంటూ విమర్శించడం సరికాదు. పల్లే యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. అది కూడా సాధరణ పౌరుడిలానే బస్సులో వచ్చాను. నేను ప్రయాణం చేసింది ఓల్వో బస్సు కాదు సాధరణ బస్సులో. గుడిసేలో కాదు అసరమైతే రోడ్డు మీద కూడా నిద్రపోగలను’ అన్నారు.
అంతేకాక ‘మా నాన్న ప్రధానిగా ఉన్నప్పుడు రష్యాలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలేస్‌లో బస చేశాను. ఇప్పుడు అవసరమైతే రోడు మీద కూడా పడుకోగలను. జీవితంలో అన్ని రకాల ఎత్తు పల్లాలు చూశాను. ఇప్పుడు బీజేపీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ కుమారస్వామి ఘాటుగా స్పందించారు. అనంతరం పల్లే యాత్రలో భాగంగా ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకోగల్గుతున్నానని.. వాటిని తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కుమారస్వామి.
Comments
Please login to add a commentAdd a comment