
తిరువనంతపురం : రానున్న రెండు రోజుల్లో కేరళలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఉత్తర కేరళలో కురుస్తున్న వర్షాలకు ముగ్గురు మరణించగా, 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 204 మిల్లిమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కానునట్లు వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కన్నూర్, కాసరగోడ్ జిల్లాలో ప్రమాద హెచ్చరికలు జారీ చేయడమే కాక.. జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. కోజికోడ్, మలప్పురం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో కేరళతో పాటుగా కర్ణాటకలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం వరకూ ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు తెలిపింది.
కేరళ, కర్ణాటక,పశ్చిమ తమిళనాడు, లక్ష్యద్వీప్ తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. మత్య్సకారులు కొన్ని రోజులు వేటకు వెళ్లకూడదని సూచించింది. బిహార్, తూర్పు రాజస్తాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, యానాం, రాయాలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే అస్సాం, మేఘాలయ, గోవా లాంటి ప్రాంతాలలో కూడా అత్యధిక వర్షాలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.