సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు తల్లిడిల్లిపోతోంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో చెన్నై నగరంతోపాటు శివారు ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటివరకు వర్షాలకు బలైన వారి సంఖ్య 11కు చేరింది. బంగాళాఖాతంలో తమిళనాడుకు సమీపంలోని మన్నార్‌వలైకుడా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం వల్ల మూడురోజులుగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాబోయే మూడు రోజుల్లో ఈ నాలుగు జిల్లాలతోపాటు విల్లుపురం, తిరువారూరు, తంజావూరు, పుదుక్కోట్టై, కన్యాకుమారి, తూత్తుకూడి, రామనాథపురం జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
నీటమునిగిన చెన్నై
భారీ వర్షాలతో చెన్నై జలదిగ్బంధమైంది. వరద నీటితో అనేక ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. అపార్ట్‌మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లలోని నివాసాల్లోకి మోకాలి లోతులో నీరు చేరింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేయడంతో ప్రజలు మరింత ఇబ్బంది పడ్డారు. 2015 డిసెంబర్‌లో చెన్నై మునకకు కారణమైన చెంబరబాక్కం చెరువు సహా ఇతర జలాశయాల్లోనూ, చెన్నైలో ప్రవహించే అడయార్ నదిలోనూ నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో ప్రజలు 2015 డిసెంబర్ నాటి భయంకరమైన రోజులను తలుచుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కొందరు ప్రజలు ఇళ్లల్లో చిక్కుకునిపోగా మరికొందరు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మంగళ, బుధవారాల్లో మొత్తం 11 మంది మృతిచెందారు. ఆర్‌ఆర్ నగర్‌లో విద్యుత్ బాక్స్ నుంచి వైరు తెగి వరద నీటిలో పడడంతో యువశ్రీ (9), భావన (7) అనే ఇద్దరు చిన్నారులు మరణించారు. భారీ వర్షాల కారణంగా బుధవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment