రోజంతా స్మార్ట్ ఫోన్ తో గడిపేస్తున్నారా?
రోజంతా స్మార్ట్ ఫోన్ తో గడిపేస్తున్నారా? అది లేకుండా క్షణం గడపలేకపోతున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త. ఈ వ్యసనం నుంచి త్వరగా బయటపడండి. లేదంటే త్వరలోనే మీకు అనేక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
స్మార్ట్ ఫోన్ వ్యసనం వల్ల ముఖ్యంగా టీనేజర్లలో ఒత్తిడి, మానసిక కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తవచ్చునని తాజా అధ్యయనంలో గుర్తించారు. కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి ఇలాంటి వ్యాధులు వస్తాయనే నానుడి ఎప్పటినుంచో ఉందని, టీవీ, వీడియో గేమ్స్ మొదలు ఇప్పటి స్మార్ట్‌ఫోన్ వరకు అందరిలో ఇలాంటి అభిప్రాయమే ఉందని, అయితే స్మార్ట్ ఫోన్ విషయంలో టీనేజర్లలో ఈ సమస్య అధికంగా ఉండే అవకాశముందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకుడు అలెజాండ్రో లెరాస్ తెలిపారు. దాదాపుగా 300 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులపై ఆయన ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. విద్యార్థుల మానసిక స్థితి, ఎంతసేపు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించడానికి వారిని పురిగొల్పిన కారణాలు ఏమిటి? వంటి అంశాల ఆధారంగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వారిపై ఏవిధంగా ప్రభావం చూపుతాయో అంచనా వేశారు.
గంటలు గంటలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి అస్తమానం అందులోనే తల దూర్చేవారి మానసిక కుంగుబాటు, ఒత్తిడికి ఎక్కువగా లోనవుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. టెక్నాలజీని మితంగా వాడటం వల్ల ఈ సమస్యలు దరిచేరకుండా చూడవచ్చునని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ అధ్యయనం వివరాలు 'కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్' అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.