అప్పుడే 'నిర్భయ' ఆత్మకు శాంతి!
యావత్ దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనకు నేటితో మూడేళ్లు. దేశ రాజధాని హస్తినలో కదులుతున్న బస్సులో ఆరుగురు కిరాతకుల చేతిలో అతి అమానుషమైన హింసను ఎదుర్కొని.. చివరివరకు ప్రాణాల కోసం పోరాడి.. తుదిశ్వాస విడిచిన పారా మెడికల్ విద్యార్థిని ఉదంతం.. ఇప్పటికీ స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. యావత్ జాతిని దిగ్భ్రాంతి పరిచిన ఈ ఘటనతో మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు జరిగాయి. లైంగిక దాడులు, మహిళలపై దాడులకు వ్యతిరేకంగా నిర్భయ చట్టం వంటి కఠిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా దేశంలో మహిళలపై నేరాలు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక చోట్ల స్త్రీలపై అకృత్యాలు, అరాచకాలు వెలుగుచూస్తేనే ఉన్నాయి. నిర్భయగా పేరొందిన ఆ వైద్య విద్యార్థిని ఉదంతాన్ని గుర్తుచేస్తూనే ఉన్నాయి.
మరోవైపు నిర్భయపై అతికిరాతకంగా లైంగిక దాడి జరిపి, ఆమెను అమానుషంగా హింసించిన నేరగాళ్లలో ఒకడైన బాలనేరస్తుడు ఈ నెల 20న విడుదల కానున్నాడు. ఘటన జరిగినప్పుడు అతడు 18 ఏళ్ల వయస్సుకు కొద్ది నెలల మాత్రమే తక్కువ ఉండటంతో అతణ్ని బాలనేరస్తుడిగా పరిగణించి మూడేళ్లపాటు సంస్కరణ గృహానికి పంపారు. మూడేళ్ల కాలం ముగియడంతో అతనికి రూ. 10 వేలు, ఓ కుట్టు మిషన్ ఇచ్చి సమాజంలోకి స్వేచ్ఛగా విడిచిపెట్టనున్నారన్న వార్తలు నిర్భయ తల్లిదండ్రులను కలిచివేస్తున్నాయి. ఇది నేరం చేసేందుకు అతనికి లైసెన్స్ ఇచ్చి సమాజంలోకి పంపడమేనని వారు అంటున్నారు. మిగతా నేరగాళ్ల మాదిరిగానే అతన్ని మేజర్‌గా పరిగణించి కఠిన శిక్ష వేయాలని వారు డిమాండ్ చేశారు.
నిర్భయ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న బాలనేరస్తుడి విడుదలపై బాలీవుడ్ అలనాటి నటి, ఎంపీ హేమామాలిని స్పందించారు. ఆ బాలనేరస్తుడిది రాక్షస మానస్తత్వమని, అతన్ని కూడా పెద్దవాడిగా పరిగణించి కఠిన శిక్ష విధించాలని ఆమె కోరారు. అప్పుడే నిర్భయ ఆత్మకు శాంతి లభిస్తుందని, ఆమె తల్లిదండ్రులు అనుభవించిన ఆత్మక్షోభకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు బారనేస్తుడి విడుదలపై స్పందించిన కేంద్ర మానవహక్కుల సంఘం ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు నోటీసులుస జారీచేసింది. ఈ వ్యవహారంపై డిసెంబర్ 21లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.