నాలుక కరుచుకున్న హేమ
ఒకవైపు తన లోక్‌సభ నియోజకవర్గం అంతా అట్టుడుకుతుంటే.. తీరిగ్గా షూటింగ్ ఫొటోలు పెడతారా అంటూ విమర్శలు రావడంతో బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమ మాలిని నాలుక కరుచుకున్నారు. విషయం ఏమిటంటే.. మథురలో అక్రమ కట్టడాలను తొలగించే విషయంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి ఇద్దరు పోలీసులు సహా 21 మంది మరణించారు. మరణించినవారిలో ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా ఉన్నారు.
అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఒక సినిమా షూటింగులో పాల్గొంటున్న మథుర బీజేపీ ఎంపీ హేమమాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఒక లాంచీ ఎక్కుతున్న ఫొటోలు మూడింటిని ఆమె ట్వీట్ చేశారు. దాంతో వెంటనే ట్విట్టర్ విమర్శలతో మోతెక్కిపోయింది. మథుర కాలిపోతుంటే ఈ సంబరాలు ఏంటంటూ నిలదీశారు. వెంటనే మేల్కొన్న హేమ మాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేసేశారు. అయితే.. ఈ విషయంలో అటు హేమమాలినికి వ్యతిరేకంగా, మద్దతుగా రెండువైపులా కూడా ట్వీట్లు వెల్లువెత్తాయి.