అంతకుముందే డేట్స్ ఇచ్చేశాను..
మథుర: ఉత్తరప్రదేశ్లోని మథురలో భారీ స్థాయిలో హింసచెలరేగిన తర్వాత స్థానిక ఎంపీ, బాలీవుడ్ నటి హేమమాలిని తీరుపై తీవ్ర విమర్శలు రావడం, బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. గురువారం రాత్రి మథుర ఘటన జరగగా.. శుక్రవారం ఉదయం తనకు తెలిసిందని హేమమాలిని చెప్పారు. మథురకు వెళుతున్నానంటూ ట్వీట్ చేశారు.
ఇక మథుర అల్లర్లతో అట్టుడికిపోతుంటే, అదే సమయంలో హేమమాలిని షూటింగ్లో పాల్గొని ఆ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడంపై వచ్చిన విమర్శలపైనా ఆమె స్పందించారు. 'నేనొక నటి. షూటింగ్కు అంతకుముందే డేట్స్ ఇచ్చాను. గురువారం రాత్రి జరిగిన ఘటన ఊహించనిది' అంటూ హేమమాలిని ట్వీట్ చేశారు.
మథురలో అక్రమ కట్టడాలను తొలగించే విషయంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి ఇద్దరు పోలీసులు సహా 24 మంది మరణించారు. మరణించినవారిలో ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. మథుర ఎంపీ అయిన హేమమాలిని ఈ ఘటనపై స్పందించకుండా, ఒక సినిమా షూటింగులో ఆమె పాల్గొన్నప్పటి ఫొటోలను ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మథుర కాలిపోతుంటే ఈ సంబరాలు ఏంటంటూ నెటిజెన్లు నిలదీశారు. ఆ తర్వాత హేమ మాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేశారు.