సంచలనాల సైనీ! | Here What 2G Case Judge OP Saini Said While Delivering Verdict | Sakshi

వదంతులు..ఊహగానాలతో

Published Fri, Dec 22 2017 2:36 AM | Last Updated on Fri, Dec 22 2017 9:38 AM

Here’s What 2G Case Judge OP Saini Said While Delivering Verdict - Sakshi

న్యూఢిల్లీ: 2జీ కేసు తీర్పు సందర్భంగా సీబీఐ న్యాయమూర్తి ఓం ప్రకాశ్‌ సైనీ కొన్ని కీలక, సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వాస్తవాలతో సీబీఐ చార్జిషీటు రూపొందించిందని, నిందితులపై ఆరోపణల్ని రుజువు చేయడంలో దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. చట్టబద్ధ సాక్ష్యం కోసం ఏడేళ్ల సమయం ఎదురుచూశానని, అయితే తన ఎదురుచూపులు పూర్తిగా వ్యర్థమయ్యాయని పేర్కొంటూ సీబీఐ విచారణ తీరును ఆయన తప్పుపట్టారు. క్విడ్‌ ప్రొ కొ ఆరోపణలకు సీబీఐ ఎలాంటి సాక్ష్యాల్ని సమర్పించలేదని.. అందువల్ల రాజాపై ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు.  

ఏడేళ్లు వ్యర్థం..
గత ఏడేళ్లుగా ఈ కేసుకు సంబంధించి ఎవరైనా సరైన సాక్ష్యాన్ని తీసుకొస్తారేమోనని అన్ని పనిదినాల్లో, వేసవి సెలవుల్లో క్రమం తప్పకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కోర్టు గదిలో కూర్చున్నాను. అయితే నా ఎదురుచూపులు వ్యర్థమయ్యాయి. న్యాయబద్ధమైన ఒక్క సాక్ష్యాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయారు. దీనిని బట్టి ప్రతి ఒక్కరూ వదంతులు, పుకార్లు, ఊహాగానాలతో కూడిన జన సామాన్య దృష్టితో ముందుకెళ్లారని అర్థమవుతోంది. న్యాయ విచారణలో అలాంటి వాటికి స్థానం లేదు. ఈ కేసులో కుట్రకు రాజా సూత్రధారి అనేందుకు రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు లేవు. రాజా తప్పుచేసినట్లు, కుట్ర లేదా అవినీతికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.  

ఉత్సాహంగా మొదలుపెట్టి..   
సీబీఐ ఈ కేసు విచారణను ఎంతో ఆవేశంగా, ఉత్సాహంతో మొదలుపెట్టింది. కేసు విచారణ కొనసాగుతున్న కొద్దీ ఎంతో జాగత్తగా, రక్షణాత్మక ధోరణితో వ్యవహరించడం వల్ల ... ఏం నిరూపించాలని ప్రాసిక్యూషన్‌ భావిస్తుందో తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారింది. తుది దశలో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఎస్‌పీపీ), సీబీఐ ప్రాసిక్యూటర్‌లు ఎలాంటి సమన్వయం లేకుండా పనిచేశారు. కేసు విచారణ చివరికొచ్చేసరికి ప్రాసిక్యూషన్‌ ప్రమాణాలు పూర్తిగా దిగజారడంతో పాటు.. ఎలాంటి దశా దిశా లేకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుగా తయారైంది. సీబీఐ, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు అనేక దరఖాస్తులు, వివరణలు సమర్పించినా.. విచారణ చివరి దశలో మాత్రం ఒక్క సీనియర్‌ అధికారి, ప్రాసిక్యూటర్‌ కూడా వాటిపై సంతకాలు చేసేందుకు మొగ్గు చూపలేదు.

దరఖాస్తులపై సంతకాల గురించి నేను ప్రశ్నించినప్పుడు.. ఎస్‌పీపీ సంతకం చేస్తారని సీబీఐ ప్రాసిక్యూటర్‌ చెప్పగా.. ఎస్‌పీపీని అడిగితే సీబీఐ సిబ్బంది సంతకం చేస్తారని సమాధానమిచ్చారు. కోర్టుకు సమర్పించిన, చెప్పిన అంశాలపై బాధ్యత తీసుకునేందుకు విచారణాధికారులు గానీ ప్రాసిక్యూటర్లు గానీ సిద్ధంగా లేరని దీనిని బట్టి అర్థమవుతోంది.  తుది వాదనల సమయంలో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తన వాదనల్ని లిఖితపూర్వకంగా సమర్పించలేదు. దానికి బదులుగా.. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు లిఖితపూర్వకంగా ఇస్తే తాను సమర్పిస్తానంటూ కోర్టుకు తెలిపారు.  లిఖితపూర్వకంగా సమర్పించిన ప్రతులపై సంతకాలు చేసేందుకు కూడా ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సిద్ధంగా లేకపోవడం అత్యంత బాధాకరం. ఎవరి సంతకం లేకపోతే కోర్టులో ఆ పత్రానికి ఉపయోగం ఏమిటి?

క్విడ్‌ ప్రొ కొ’కు ఎలాంటి ఆధారాలు లేవు
ఏ రాజాను ప్రశ్నించే సమయంలో ప్రాసిక్యూషన్‌ మొదటిసారి ‘క్విడ్‌ ప్రొ కొ’ పదం వాడింది. ప్రాసిక్యూషన్‌ సమర్పించిన మొత్తం ఆధారాల్లో.. రూ. 200 కోట్ల బదిలీని అక్రమ ప్రతిఫలంగా నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాన్ని పేర్కొనలేదు. అలాగే కలైంగర్‌ టీవీలో పెట్టుబడి పెట్టిన నాలుగు సంస్థలు.. ఆ పెట్టుబడిని సాధారణ వ్యాపార లావాదేవీలుగా నమ్మించేందుకు వాటి గుర్తింపును దాచిపెట్టాయన్న ఆరోపణకు సాక్ష్యం సమర్పించలేదు. రాజాను దోషిగా నిరూపించేందుకు అవసరమైన వ్యతిరేక సాక్ష్యం లేదని సీబీఐ చేసిన నిరుపయోగమైన క్రాస్‌ ఎగ్జామినేషన్‌తో అర్థమవుతోంది. అందువల్ల కలైంగర్‌ టీవీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టడంలో రాజా పాత్ర ఉందన్న ప్రాసిక్యూషన్‌ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు.

అందుకు రాజాను తప్పుపట్టలేం
అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కార్యాలయంలోని సీనియర్‌ అధికారులు వాస్తవాల్ని మన్మోహన్‌కు తెలియకుండా కప్పిపుచ్చినందుకు రాజాను తప్పు పట్టలేం. రాజా లేఖలోని సంబంధిత, వివాదాస్పద అంశాల్ని మన్మోహన్‌కు తెలియకుండా పులక్‌ ఛటర్జీ దాచిపెట్టారు. అందువల్ల ప్రధానిని రాజా తప్పుదారి పట్టించారని లేక ఆయనకు తెలియకుండా వాస్తవాల్ని దాచిపెట్టారన్న ప్రాసిక్యూషన్‌ వాదనలో ఎలాంటి నిజం లేదు.

నేర్పుగా ఈ కుంభకోణాన్ని అల్లారు
కొందరు నేర్పుగా కొన్ని ఎంపికచేసుకున్న వాస్తవాలతో 2జీ కుంభకోణాన్ని అల్లారు. ఊహించని స్థాయిలో అవినీతి జరిగిందని అనుకునే స్థాయికి అంశాల్ని పెద్దది చేసి చూపించారు. ఈ కేసులో తప్పుడు వాస్తవాలతో అద్భుతంగా సీబీఐ చార్జిషీటును తయారుచేసింది. అయితే 2జీ కేసులో నిందితులపై ఆరోపణల్ని రుజువు చేయడంలో విఫలమైంది.  టెలికం శాఖకు చెందిన కొందరు అధికారుల చర్యలు, నిర్లిప్తత వల్ల ఈ కేసులో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిఒక్కరూ భావించారు. వారి చర్యలు ఒక పెద్ద కుంభకోణం జరిగినట్లు ప్రజలు ఊహించేదిశగా ప్రేరేపించాయి.

టెలికం శాఖ రికార్డుల ప్రకారం.. యూఏఎస్‌ఎల్‌(యూనిఫైడ్‌ యాక్సెస్‌ సర్వీస్‌ లైసెన్స్‌) కోసం దరఖాస్తుల పరిశీలన, లైసెన్స్‌ల కేటాయింపుల్లో కొందరు అధికారుల నిర్వాకం వల్ల ఆ శాఖలో ఎంత గందరగోళం ఉందో స్పష్టమైంది. అధికారిక బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, స్పష్టత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అంతే కాదు.. వారే స్వయంగా రూపొందించిన అధికారిక రికార్డులతో తమకు సంబంధం లేదని చెప్పి చంచల మనస్తత్వంతో, పిరికితనంగా వ్యవహరించారు. రికార్డుల్లో పేర్కొన్న దానికి భిన్నంగా తప్పును మరొకరిపై నెడుతూ వాంగ్మూలమిచ్చారు.  

సంచలనాల సైనీ!
2జీ స్పెక్ట్రమ్‌ కేసులో ఎవరూ ఊహించని రీతిలో తీర్పు ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓంప్రకాశ్‌ సైనీ(58) 1980ల్లో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరిన ఆరేళ్లకు పరీక్ష రాసి మేజిస్ట్రేట్‌ అయ్యారు. హరియాణాకు చెందిన సైనీ ఢిల్లీ ప్రత్యేక పోటా జడ్జీగా ఎర్రకోట కాల్పుల కేసులో నిందితులకు మరణశిక్ష విధించి సంచలనం సృష్టించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌ను దోషిగా తేలుస్తూ ఆయన విధించిన మరణశిక్షను తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఖరారుచేశాయి.

పలు సున్నితమైన కేసుల్ని విచారించడంతో సైనీకి కేంద్రం 24 గంటలపాటు ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. టెలికాం స్పెక్ట్రమ్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఢిల్లీ ప్రభుత్వం సైనీ నేతృత్వంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. 2జీ కేసుకు ముందు కామన్‌వెల్త్‌ క్రీడల కుంభకోణం కేసును సైనీ విచారించారు. చివరికి కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి  సురేష్‌ కల్మాడీ సహాయకులు ఆరుగురిని దోషులుగా తేల్చి జైళ్లకు పంపారు.

2జీ కేసులో నిందితురాలైన డీఎంకే ఎంపీ, తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధి కూమార్తె కనిమొళికి బెయిల్‌ ఇవ్వడానికి సైనీ నిరాకరించడం అనూహ్య పరిణామం. ఆమె మహిళ కాబట్టి బెయిల్‌ ఇవ్వాలన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఎందరినైనా ప్రభావితం చేయగల శక్తిమంతమైన నేత కావడంతో ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. 2జీ కేసు విచారణ సందర్భంగా ఎంతటి పెద్ద వ్యాపారవేత్తలనూ వదలకుండా వారు కోర్టులో క్రమశిక్షణ పాటించేలా సైనీ వ్యవహరించి అందరి ప్రశంసలు పొందారు.

మొబైల్‌ టెలికాం రంగంలో హేమాహేమీలైన ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌ భారతీ మిత్తల్, హచిసన్‌ మేక్స్‌ అధినేత అసీమ్‌ ఘోష్, స్టెర్లింగ్‌ సెల్యూలర్‌ చీఫ్‌ రవి రూయాలను తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించి సైనీ కోర్టుకు రప్పించారు. ‘గత ఏడేళ్లుగా వేసవి సెలవులతో సహా అన్ని పనిదినాల్లో నేను ఉదయం పది నుంచి ఐదింటి వరకూ ఓపెన్‌ కోర్టులో కూర్చున్నా. ఎవరైనా చట్టపరంగా నిలబడే సాక్ష్యం ఏదైనా తీసుకొస్తారేమోనన్న నా ఎదురుచూపులు నిష్ఫలమయ్యాయి’అని సైనీ తన తీర్పులో చెప్పిన మాటలు ఆయన నిజాయితీకి మచ్చుతునకలు.     
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement