గురుగ్రామ్‌లో హైటెన్షన్.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
గురుగ్రామ్‌లో హైటెన్షన్.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
Published Mon, Sep 11 2017 9:04 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM
సాక్షి, గుర్‌గ్రామ్: చిన్నారి ప్రద్యుమన్ ఠాకూర్(7) హత్యా ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్కూళ్లోనే విద్యార్థిని గొంతు కోసి హత్య చేయటంతో విద్యార్థుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు నేడు, రేపు నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా గుర్‌గ్రామ్‌తోపాటు చుక్కల పక్కల ప్రాంతాల్లోని పాఠశాలలన్నీ మూతపడనున్నాయి. స్కూల్ రీజీనల్ హెడ్, హెచ్‌ఆర్ హెడ్‌లను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అదే సమయంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ప్రద్యుమ్న తండ్రి వరణ్ ఠాకూర్ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. స్కూళ్లో సరైన భద్రత లేకపోవటమే తన కొడుకు మరణానికి కారణమైందని ఆయన ఆరోపిస్తున్నారు.
సిట్ ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇదే విషయం వెల్లడైందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గొంతు కోసే సమయంలో కనీసం తన కొడుకు అరుపు ఎవరైనా విని ఉండరా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కప్పిపుచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదంటూ వరుణ్ వ్యాఖ్యలు చేశారు. స్కూల్ యాజమాన్యం ఇప్పటిదాకా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని వరుణ్ బంధువు, సుప్రీంకోర్టు న్యాయవాది సుశీల్ తెక్రీవాల్ తెలిపారు. వాళ్ల తరపు తప్పు ఉంది కాబట్టే ముఖాలు చూపించుకోలేకపోతున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు.
స్కూల్లో వసతులు సరిగ్గా లేవని, కనీసం సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పని చేయటం లేదని సిట్ ప్రాథమిక దర్యాప్తు అనంతరం వెల్లడించిన విషయం తెలిసిందే. కండక్టర్ ప్రవర్తనను పరిశీలించకుండానే స్కూల్ యాజమాన్యం విధుల్లోకి తీసుకుందని వెల్లడైంది. ‘సెక్సువల్ ప్రవర్తన’ కారణంగా అతన్ని ఇంతకు ముందు పని చేసిన స్కూల్ యాజమాన్యం విధుల నుంచి తొలగించిన విషయం వెలుగుచూసింది.
ఇక స్కూల్ యాజమాన్యంపై జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద కేసు నమోదైనట్లు విద్యాశాఖా మంత్రి రాం విలాస్ శర్మ ప్రకటించారు. స్కూల్ యాజమాన్యంతోపాటు, నిర్వాహకుల పేర్లు కూడా ఛార్జ్‌షీట్‌లో నమోదైనట్లు ఆయన వెల్లడించారు. అయినప్పటికీ శాంతించని తల్లిదండ్రులు సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం పేరెంట్స్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసి ఓ వైన్ షాపును తగలబెట్టగా, లాఠీఛార్జీలో పలువురు మీడియా సిబ్బందికి కూడా గాయాలయిన విషయం విదితమే.
Advertisement
Advertisement