బియాస్ విషాదం నుంచి మేల్కోవాలి
సిమ్లా: ప్రకృతి సౌందర్యానికి హిమాచల్ ప్రదేశ్ మారుపేరు. కొండలు, కోనలు, వాగులు, పర్వతాలు, జలపాతాలు, ఆహ్లాదకర వాతావరణంతో భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. అందుకే ఈ ఉత్తరాది రాష్ట్రం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అయితే అక్కడికెళ్లే పర్యాటకుల భద్రత గాలిలో దీపం వంటిది. ఇందుకు బియాస్ దుర్ఘటనే ఉదాహరణ. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు 24 మంది నదిలో గల్లంతయ్యారు. ఈ విషాదం నుంచైనా హిమాచల్ ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. పర్యాటకుల తగిన భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది.
హిమాచల్లో సట్లజ్, బియాస్, యమున, చెనాబ్, రవి నదులు, వాటి ఉపనదులు ప్రవహిస్తాయి. ఇవి ఎక్కువగా జాతీయ, రాష్ట్ర రహదారులకు సమాంతరంగా ప్రవహిస్తాయి. కొన్ని చోట్ల కొండలోయల మధ్యన నదులు ప్రవహిస్తాయి. ఇలాంటి పర్వత ప్రాంతాల్లో భయంకరమైన మలుపు మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు గాల్లోకే. ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు అదుపు తప్పి లోయలు, నదుల్లోకి బోల్తాపడుతుంటాయి. తాజాగా హైదరాబాద్ విద్యార్థుల విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అయినా హిమాచల్ ప్రభుత్వం మేలుకొన్నట్టు లేదు. భద్రతకు సంబంధించి పర్యాటకులను హెచ్చరించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ చాలా మార్గాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. మనాలి ప్రాంతంలోనే ప్రతి ఏటా కనీసం ఐదారుగురు చనిపోతున్నారని పోలీసు కేసులు చెబుతున్నాయి. ఇక గాయలబారిన పడటం, చిన్న చిన్న సంఘటనలు రికార్డుల్లో ఉండవు.
'పర్యాటకులు నదులు, అక్కడి వాతావరణానికి ఆకర్షితులవుతారు. నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా నదుల్లోకి దిగుతారు. అకస్మాత్తుగా ప్రవాహం పెరగడంతో క్షణాల్లు కొట్టుకుపోతారు' అని మనాలికి చెందిన టూర్ ఆపరేటర్ చెప్పారు. ఆదివారం బియాస్ నది దుర్ఘటన కూడా ఇలాంటిదే అని విశ్లేషించారు. హిమాచల్ ప్రదేశ్లో చాలా హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తిని బట్టి డ్యాం గేట్లను తరచూ ఎత్తేస్తుంటారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఇలాంటి ప్రమాదాల గురించి ముందే హెచ్చరించాల్సిన అవసరముందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. అంతేగాక హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఉంచడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా ముళ్ల తీగలను ఏర్పాటు చేయాలని చెప్పారు.