హింగ్లిష్ భాషకు క్రేజ్ పెరుగుతోంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా బ్రిటన్ తదితర దేశాలకు విస్తరిస్తోంది. మనదేశంలోని ఏ నగరంలోనైనా బ్రిటన్ పౌరులు ఎదురుపడి, హిందీ, ఇంగ్లిష్ కలగలిపిన భాష హింగ్లిష్‌లో ఏదైనా అడ్రస్ లేదా సమాచారాన్ని కోరితే ఆశ్చర్యపోకండి. ఇంతకీ ఇదేదో కొత్త భాష అనుకుంటున్నారా... అదేం లేదు. ఇప్పటికే మన దేశంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చి రోజువారి కార్యకలాపాల్లో కూడా భాగమై పోయింది.
భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాషలో ఇంగ్లిష్ పదాలు అలవోకగా అమరిపోయి వ్యవహారంలోకి వచ్చేశాయి. అంతేస్థాయిలో తెలుగు, బెంగాలీ, ఇతర ప్రాంతీయ భాషల్లో ఇంగ్లిష్ మిళితమై పోయింది. అన్నిస్థాయిల్లోని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ భాషలు రూపాంతరం చెందాయి.
హైబ్రీడ్ భాషగా...
ప్రస్తుత విశేషం ఏమంటే... హిందీ, ఇంగ్లిష్ కలగలిసి హైబ్రీడ్ భాషగా మారిన నేపథ్యంలో దీనిని ప్రత్యేకంగా బోధించేందుకు బ్రిటన్‌లోని ఒక కాలేజీ ఏకంగా ఓ కోర్సును కూడా ప్రవేశపెట్టేసింది. ఇంగ్లండ్‌లో పేరు ప్రఖ్యాతులున్న పోర్ట్స్‌మౌత్ కాలేజీ విలక్షణమైన ఈ భాషను బోధిస్తోంది. భారత్‌లో లేదా బ్రిటన్‌లోని భారత కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న ఇంగ్లిష్ విద్యార్థులకు ఈ కోర్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతుండడంతో భారత్‌లో మనుగడ సాధించేందుకు, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మలుచుకునేలా ఇతరదేశాల వారు ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో హింగ్లిష్ సంభాషణలు పెరగడం, లవ్ ఆజ్ కల్, జబ్ వీ మెట్ వంటి ఫిల్మ్ టైటిళ్లతో సినిమాలు రావడం వీక్షకుల్లో ఒకింత క్రేజ్‌ను పెంచాయి. దీనితో పాటు టెలివిజన్, వార్తాపత్రికలు, మొత్తంగా మీడియా సంబంధిత కార్యక్రమాల్లో రెండు విడిదీయరానంతగా కలిసిపోయాయి. ఇప్పటికే ‘యే దిల్ మాంగే మోర్’ వంటి టీవీ వాణిజ్య›ప్రకటనలు ప్రజాదరణ పొందాయి.
మంచి స్పందన...
హింగ్లిష్ కోర్సుకు వచ్చిన స్పందన కూడా కాలేజీ యాజమాన్యాన్ని ఆశ్యర్యానికి గురిచేసింది. ‘ఈ కోర్సు పట్ల ఎక్కువ సంఖ్యలోనే ఆసక్తిని కనబరిచారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా దీనిని మొదలుపెట్టినపుడు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఫీడ్‌బ్యాక్ బాగా ఉండడంతో వచ్చే సెప్టెంబర్ నుంచి దీర్ఘకాలిక కోర్సును ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ఉన్నాము’ అని కోర్సు బోదనాధిపతి జేమ్స్ వాటర్స్ వెల్లడించారు. హింగ్లిష్ వినియోగం గణనీయంగా పెరుగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్ మాట్లాడేవారి సంఖ్య కంటే హింగ్లీస్ సంభాషించే వారు పెరిగిన ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని భాషా శాస్త్రవేత్త డేవిడ్ క్రిస్టల్ అభిప్రాయపడ్డారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment