
పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు.
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజహిదీన్ టాప్ కమాండర్ హమద్ ఖాన్ సహా ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. భద్రతా దళాలు ఆదివారం పుల్వామా ప్రాంతంలోని గుల్షన్‌పురాలో గాలింపు చర్యలు చేపడుతుండగా ఓ నివాస గృహంలో ఉగ్రవాదులు తలదాచుకున్న సమాచారం అందడంతో ఆ ఇంటిని చుట్టుముట్టాయి. భద్రతాదళాలపై భవనం లోపలి నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపగా, ప్రతికాల్పుల్లో హమద్ ఖాన్ సహా ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఘటనా స్ధలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా అనంత్‌నాగ్‌లో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులను శనివారం భద్రతా దళాలు అరెస్ట్ చేసిన మరుసటి రోజే భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం.