విదేశీ విరాళాలపై నిషేధం
జాబితాలో జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ, ఇగ్నో
న్యూఢిల్లీ: విదేశాల నుంచి విరాళాలు అందుకుంటూ రిటర్నులు దాఖలు చేయని పలు ప్రతిష్టాత్మక సంస్థలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీ, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్), ఐఐటీ ఢిల్లీ తదితర సంస్థలు విదేశాల నుంచి విరాళాలు అందుకోకుండా హోంశాఖ నిషేధం విధించింది. విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్‌సీఆర్‌ఏ)చట్టం–2010 ప్రకారం ఈ సంస్థల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఆదాయ, వ్యయాలను సమర్పిం చాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించనందునే ఈ చర్య తీసుకున్నట్లు హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం ప్రకారం విదేశీ విరాళాల వివరాలను ఎఫ్‌సీఆర్‌ఏ వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోతే రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేయడం కుదరదన్నారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో), లేడీ ఇర్విన్ కళాశాల, గాంధీ పీస్ ఫౌండేషన్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, సాయుధ బలగాల ఫ్లాగ్‌డే ఫండ్, డా.రామ్‌మనోహర్ లోహియా ఇంటర్నేషనల్ ట్రస్ట్, శ్రీ సత్యసాయి ట్రస్ట్‌ల రిజిస్ట్రేషన్‌ను ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం కింద రద్దు చేసినట్లు వెల్లడించారు. 2010–11 నుంచి 2014–15 వరకు ఐదేళ్ల కాలానికి ఈ సంస్థలేవీ తమ ఆదాయ, వ్యయాలను సమర్పించలేదని పేర్కొన్నారు.