సాక్షి, న్యూఢిల్లీ: జైలుపాలైన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ మంగళవారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు. తాను దేశం వదిలి ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే కోర్టులో లొంగిపోతానని ఆమె వెల్లడించారు. మీడియాలో కథనాలు వస్తున్నట్టుగా గుర్మీత్.. తనను లైంగికంగా వేధించలేదని చెప్పారు.
గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం చెలరేగిన అలర్ల కేసులో హనీప్రీత్ కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెపై కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం కోర్టు ముందు లొంగిపోతారని కథనాలు వచ్చాయి. ఈక్రమంలో ఆమె అన్యూహంగా 'సీఎన్‌ఎన్ న్యూస్18', 'ఇండియా టుడే' చానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె కోసం వెతుకుతున్న హర్యానా పోలీసుల కళ్లుగప్పి మరీ ఆమె ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడం గమనార్హం.
గుర్మీత్, తనకు మధ్య ప్రవిత్ర అనుబంధం ఉందని, తన మధ్య బంధాన్ని కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారని హనీప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ' మా గురించి చెప్తున్నదంతా అబద్ధమే. ఒక తండ్రి తన కూతురి తలపై ప్రేమగా చేయి పెట్టడం కూడా తప్పేనా? భావోద్వేగాలు చనిపోయాయా? తండ్రి-కూతుళ్ల అనుబంధం పవిత్రమైనది కాదా? ఎందుకు వారు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని హనీప్రీత్ పేర్కొన్నారు. గుర్మీత్‌కు శిక్షపడిన అనంతరం పంచకులలో అల్లర్ల రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆరోపణలు చేస్తున్నారని, కానీ అందుకు ఆధారాలు ఎక్కడ అని ఆమె ప్రశ్నించారు. గుర్మీత్ అమాయకుడని, ఆయనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళుతామని ఆమె చెప్పారు. దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, గుర్మీత్ విడుదల అవుతారని ఆమె అన్నారు. ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌తో తనకు అక్రమ సంబంధం ఉందంటూ తన మాజీ భర్త విశ్వాస్ గుప్తా చేసిన ఆరోపణలపై ఆమె స్పందించడానికి నిరాకరించారు. అతని గురించి మాట్లాడబోనని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment