పూణె: నగరానికి దగ్గరలోని ఓ గ్రామంలోని బావిలో చిక్కుకున్న చిరుతను అటవీశాఖ అధికారులు కాపాడారు. పింపల్ గావ్ సిద్ధానాధ్ గ్రామం శివారులో ఆదివారం ఉదయం ఓ బావి నుంచి పెద్దగా గాండ్రింపులు వినిపించాయి. వాటిని అనుసరిస్తూ బావి దగ్గరకు వెళ్లిన రైతుకు 60 అడుగుల లోతు బావిలో చిరుతపులి ప్రాణాల కోసం పోరాడుతుండటాన్ని గమనించాడు. చిరుతను చూసిన భయాన్ని తగ్గించుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.
దాంతో వైల్డ్ లైఫ్ ఎస్ఎస్ఓతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు తొలుత చిరుత శ్రమను తగ్గించడానికి మూడు అడుగుల దుంగను బావిలోకి వేశారు. అప్పటికే బాగా అలసిపోయిన చిరుత.. ప్రాణభయంతో దుంగను గట్టిగా పట్టుకుంది. ఒక పులి బోనుకు తాళ్లు కట్టని అధికారులు గ్రామస్థుల సాయంతో దానిని బావిలోకి దించారు. బోను దగ్గరకు రావడంతో చిరుత దానిలోకి వెళ్లడానికి యత్నించగా.. జారి మళ్లీ నీళ్లలో పడిపోబోయింది. బోనును ఇంకొంచెం కిందకు దించిన అధికారులు ఈసారి చిరుతను బోనులోకి వెళ్లేట్టుగా చేయడంలో సఫలం అయ్యారు. చిరుత బోనులోకి వెళ్లగానే బోనును మూసివేశారు.
జున్నూర్ జిల్లాలో ఎక్కువగా బావులు ఉండటం వల్ల తమ నివాసాల నుంచి తప్పిపోయిన వన్యప్రాణులు చెరకు పంటలో తలదాచుకుంటున్నాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేశ్ ఖర్మాలే చెప్పారు. అప్పుడప్పుడు ఇలా బావుల్లో చిక్కుకుపోతున్నట్లు తెలిపారు. రక్షించిన చిరుతకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరిగి అడవిలో వదిలేసినట్లు వివరించారు.