తిరువనంతపురం/సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు, కేరళలోని దక్షిణ ప్రాంతాల్లో ‘ఓక్కి’ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. వర్ష సంబంధిత కారణాలతో ఇరు రాష్ట్రాల్లోనూ నలుగురేసి చొప్పున మొత్తం 8 మంది మరణించారు. తిరువనంతపురం జిల్లాలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన 57 మంది మత్స్యకారులు ఇంకా తిరిగిరాలేదు. వారిని వెతికేందుకు నౌకాదళం నాలుగు ఓడలు, రెండు విమానాలతో రంగంలోకి దిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక కార్యక్రమాలను చేపడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ మరో 24 గంటలపాటు మరింత ఉధృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్ ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. లక్షద్వీప్‌ల్లోనూ శనివారం నుంచి వర్షాలు కురుస్తాయని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి చెప్పారు.
కేరళలో మరో 48 గంటలు, తమిళనాడులో మరో 24 గంటలపాటు తీరం వెంబడి 65 నుంచి 75 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపిం ది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాపై ఓక్కి ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. పలు జిల్లాల్లో 3,000 విద్యుత్తు స్తంభాలు, వందలకొద్దీ చెట్లు నేలకొరగడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వృక్షాలు కూలడంతో కన్యాకుమారి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. అటు తూత్తుకుడి, తిరునెల్వేలి, విరుదునగర్, తంజావూరు జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో తిరువనంతపురం, కొల్లాం, ఎర్నాకులం, ఆలప్పూజ, పఠానంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. సముద్ర తీరానికి 100 మీటర్ల దూరంలో నివసించేవారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని అధికారులు ఆదేశించారు. కేరళ ప్రభుత్వం తీరప్రాంత రక్షణ, వైమానిక, నౌకాదళాల సాయం కూడా తీసుకుంటోంది.
కేరళలో కరెంట్ షాక్ తగిలి ఓ వృద్ధ జంట సహా మొత్తం నలుగురు మరణించారు. తిరునెల్వేలి–కన్యాకుమారి–తిరువనంతపురం మార్గంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలో శుక్ర, శనివారాల్లో పర్యటించాల్సి ఉండగా తుపాను కారణంగా పర్యటనను వాయిదా వేసుకున్నారు. తిరువనంతపురం, ఆ జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు శ్రీలంకలోనూ వర్షాలకు ఏడుగురు మరణించారు.
ఓక్కి... ఓ బెంగాలీ పదం
కోట్లాది ప్రజానీకానికి సమాచారం అందించే వ్యవస్థలకు, జనానికి సులువుగా అర్థమవడానికి వీలుగా తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం వచ్చింది. ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితికి చెందిన ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సాంఘిక సంఘం(ఇస్కాప్) కలసి 2000 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలోని తుపాన్లకు పేర్లు పెట్టడం ప్రారంభించాయి. సాధారణంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో సెప్టెంబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్య తుపాన్లు వస్తుంటాయి.
తుపాను పేరును ఖరారుచేసే అవకాశం ఈసారి బంగ్లాదేశ్‌కు రావడంతో కన్ను అనే అర్థమిచ్చే బెంగాలీ మాట ఓక్కి పేరును ఆ దేశం ప్రకటించింది. ఈ ఏడాది మే నెలలో వచ్చిన ‘మోరా’ తుపాను ఈశాన్య భారతాన్ని అతలాకుతలం చేసింది. థాయ్ భాషలో మోరా అంటే సాగర నక్షత్రం అని అర్థం. తదుపరి తుపానుకు పేరు పెట్టే అవకాశం భారత్‌కు ఇవ్వగా ఇప్పటికే ఆ పేరును ఖరారు చేశారు. ఓక్కి తర్వాత ఈ ప్రాంతంలో వచ్చే తుపానుకు ‘సాగర్’ పేరును భారత్ నిర్ణయించింది.
మరోవైపు ఓక్కి తీవ్రత తెలుపుతూ భారత వాతావరణ శాఖ ‘ఆరంజ్’ హెచ్చరిక జారీచేసింది. తమిళనాడులోని కన్యాకుమారికి దక్షిణాన 55 కిలోమీటర్లు, కేరళ రాజధాని తిరువనంతపురానికి నైరుతి దిశగా 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను లక్షద్వీప్‌వైపు పయనిస్తోందని ప్రైవేటు వాతావరణ పరిశోధనసంస్థ స్కైమెట్ తెలిపింది. బలమైన ఈదురుగాలుల ఫలితంగా దక్షిణ కేరళ, లక్షద్వీప్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment