FACT CHECK: Is this the video of US drone strike that killed Iranian general Soleimani? - Sakshi
Sakshi News home page

అమెరికా డ్రోన్ దాడి : ఆ వీడియో అసలైనదేనా !

Published Tue, Jan 7 2020 4:56 PM | Last Updated on Tue, Jan 7 2020 8:57 PM

How to Find Out Fake Videos - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానిని హతమార్చడానికి అమెరికా డ్రోన్‌ విమానం క్షిపణులతో పేల్చివేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ప్రచారంలోకి వచ్చాయి. సులేమానీ ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై డ్రోన్‌ ద్వారా బాంబులు ప్రయోగించి పేల్చిన ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ అంటూ తెర ప్రచారంలోకి వచ్చిన ఈ వీడియో నకిలీది కావడం గమనార్హం. ఒక వీడియో గేమ్‌లోని వీడియో క్లిప్పును ఈ రకంగా ప్రచారంలోకి తెచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ వాస్తవానికి ‘వీడియో వార్‌ గేమ్‌–ఆర్మా 3’లోనిది. ఇదే వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, అప్పుడు రెండు లక్షల మంది వీక్షించారు. అందులో ఇద్దరు టర్కీ సైనికులు వాకీ టాకీలో మాట్లాడుతుండగా, వెనక బ్యాక్‌ గ్రౌండ్‌లో టర్కీ సంగీతం కూడా వినిపిస్తుంది. సిరియాలోని ఆఫ్రిన్‌ ప్రాంతంలో టర్కీ డ్రోన్‌ దాడులు జరిపిన వీడియో అంటూ నాడు టర్కీ ప్రభుత్వ టీవీ ఇదే వీడియోను ప్రసారం చేసింది.

ఎలాంటి యుద్ధ వార్తలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన ‘వీడియో గేమ్‌’ దృశ్యాలను ప్రసారం చేయడం టర్కీ టీవీ ఛానళ్లకు మొదటి నుంచి అలవాటు. ఇప్పుడు ఆ జబ్బు ప్రపంచ వ్యాప్తంగా చాలా టీవీ ఛానళ్లకు పట్టుకుంది. అమెరికా, ఇరాక్‌ దేశాలు కుమ్మక్కయ్యాయంటూ ఒకప్పుడు రష్యా ప్రభుత్వం కూడా ‘ఏసీ–130 గన్‌షిప్‌ సిములేటర్‌’ మొబైల్‌ గేమ్‌ క్లిప్పును ప్రసారం చేసింది. వాటిని వీక్షించిన వాళ్లు ఆ క్లిప్పింగ్‌లను కాపీ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం అలవాటుగా మారిపోయింది. నాడు భారత్‌ వైమానిక దళం పాక్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి పాక్‌ టెర్రరిస్టుల స్థావరాన్ని పేల్చివేసిన దృశ్యాలంటూ భారత్‌ టీవీ ఛానళ్లలో కూడా వార్‌ వీడియో గేమ్‌ క్లిప్పింగ్‌లను ప్రసారం చేశాయి. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న క్లిప్పింగ్‌కు సంబంధించిన ‘ఆర్మా 3 వీడియో వార్‌ సిములేషన్‌ గేమ్‌’ వీడియోను యూట్యూబ్‌ గత ఏప్రిల్‌ నెలలోనే లోడ్‌ చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్‌లోని టర్కీష్‌ మాటల స్థానంలో ఇంగ్లీష్‌ మాటలను లోడ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఏ నకిలీ వీడియోనైనా ‘రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌’ పద్ధతిలో పట్టుకోవచ్చు. ఇందుకు ‘ఇన్‌విడ్, రివ్‌ఐ’ అన్న టూల్స్‌ కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. లేదంటే వీడియోలో చెబుతున్న లొకేషన్, వాస్తవంగా సంఘటన జరిగిన లొకేషన్‌ ఒక్కటేనా అన్న విషయాన్ని గూగుల్‌ ఎర్త్, వికీమాపియా ద్వారా కూడా సులభంగానే తెలుసుకోవచ్చు.

ఇరాన్‌ జనరల్‌ సులేమాన్‌పై అమెరికా జరిపిన డ్రోన్‌ దాడికి సంబంధించిందేనా వైరల్‌ వీడియో అన్నది తేల్చుకోవడానికి ఇంత సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం లేదు. కామన్‌ సెన్స్‌ ఉంటే చాలు. ఆ రోజు సులేమాన్, ఆయన ఇరాక్‌ మద్దతుదారు అబూ మెహదీ అల్‌తో కలిసి ఒక టయోటా ఎస్‌యూవీ కారులో బాగ్దాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరగా, వారి ఇద్దరికి సంబంధించిన 8 మంది బాడీ గార్డులు మరో టయోటా ఎస్‌యూవీలో బయల్దేరారు. అమెరికా డ్రోన్‌ ద్వారా వాటిపైకి మూడు క్షిపణులను ప్రయాగించగా ఆ రెండు ఎస్‌యువీ కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కరు కూడా బయట పడలేదు. పైగా అమెరికా డ్రోన్‌కు ఒకే సారి నాలుగు క్షిపణులను మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. వైరల్‌ అవుతున్న వీడియోలో పదులు, ఇరవై సంఖ్యలో క్షిపణులు ప్రయోగించగా ఏడెనిమిది సైనిక వాహనాలు ధ్వంసం అవడం, ధ్వంసమవుతున్న వాహనాల నుంచి తుపాకులు పట్టుకున్న సైనికులు బయటకు రావడం కనిపిస్తోంది. 

కొసమెరుపు : ఏసీ 130 గన్‌షిప్ సిమ్యులేటర్ కాన్వాయ్ ఎంగేజ్‌మెంట్ పేరుతో 2015 లోనే ఒక వీడియో గేమ్ యూట్యూబ్‌లో పబ్లిష్ ‍కాగా 57 లక్షలకుపైగా వీక్షించారు. అందులోని క్లిప్పులే ఇలాంటి సందర్భాల్లో అనేక రకాలుగా వాడుకలోకి తెచ్చి వైరల్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement