సాక్షి, న్యూఢిల్లీ: టెర్రరిస్టులు ఎందుకు అంత కర్కషులుగా, ఉన్మాదులుగా మారుతారు ? ఎందుకు అమాయకులను, అనామకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతారు ? ప్రాణాలను పణంగా పెట్టి ఎందుకు ఆత్మాహుతి బాంబులై పేలుతారు ? ఎందుకు వందలాది మంది ప్రజలను పొట్టన పెట్టుకుంటారు ? వారి పుట్టుకతోనే వారిలో ఏదైనా లోపం ఉందా ? వారు పెరిగిన వాతావరణ పరిస్థితుల వల్ల వారు అలా తయ్యారయ్యారా? పిచ్చి సిద్ధాంతాలు వారి బుర్రలో నాటుకోవడం వల్ల ఉన్మాదం తలకెక్కిందా ? వారు మెదడులోనే లోపాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ‘ఆర్టీస్ ఇంటర్నేషనల్’ సంస్థలో భాగమైన ఓ వైద్య బృందం టెర్రరిస్టులపై, వారి ఆలోచనా విధానాలపై విస్తృతంగా పరిశోధనలు జరిపింది. వారి మెదళ్లను స్కాన్‌చేసి అధ్యయనం జరిపింది.
ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్న లేదా చంపాలనుకుంటున్న టెర్రరిస్టులందరూ మానసిక రోగులేనని, వారిలో ఐక్యూస్థాయి చాలా తక్కువగా ఉందని వైద్యబృందం కనుగొన్నది. వీరు ఒకరకమైన టెర్రరిస్టులయితే పరిసరాల ప్రభావం వల్ల రెండోరకం టెర్రరిస్టులు తయారవుతున్నారని వైద్యబృందం తెలిపింది. కడు పేదరికం, సమాజంలో చిన్నచూపు, వెలి వేసిన భావాల వల్ల కలిగే కసి, ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రచారం వల్ల రెండోరకం టెర్రరిస్టులు తయారవుతున్నారని వారు తేల్చారు. బార్సిలోనాలో 535 మంది టెర్రరిస్టులపై అధ్యయనం చేసి, వైద్య పరీక్షల కోసం వారిలో 38 మందిని, అలాగే పాకిస్థాన్‌లో 146 మంది టెర్రరిస్టులపై అధ్యయనం చేసి వారిలో 30 మందిని పరీక్షల కోసం ఎంపిక చేశామని, వారిని వివిధ రకాలు విచారించడం ద్వారా, వారి మెదళ్లను ఎంఐఆర్ స్కానింగ్ చేయడం ద్వారా వైద్యబృందం తమ పరిశోధనలను కొనసాగించింది.
‘మాలో ఎప్పుడెప్పుడు తుపాకులు ఎక్కుపెట్టి కాల్చాలా ! అన్న ఆతృత ఉంది. ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉన్నాం. కచ్చితంగా మా మెదళ్లలో తేడా ఉండే ఉంటుంది. లేకపోతే మా లక్ష్యం కోసం మా ఆత్మాహుతికి ఎలా సిద్ధమవుతాం. మా మెదళ్లను స్కాన్ చేయండి, ఆ తేడాలేమిటో మీరే తేల్చి చెప్పండి’ అంటూ బార్సిలోనాకు చెందిన ఇద్దరు యువకులు తమ పరిశోధనలకు ఎక్కువ సహకరించారని వైద్యబృందం తెలిపింది. 2014 నుంచి 2017 మధ్యకాలంలో 38మంది టెర్రరిస్టులపై తాము అధ్యయనం జరిపామని, 2017 ఆగస్టులో బార్సిలోనాలో జరిగిన టెర్రరిస్టు పేలుళ్లలో 16 మంది చనిపోగా, 152 మంది గాయపడ్డారని వెల్లడించింది. తాము పరిశోధనలు జరిపిన టెర్రరిస్టుల్లో కొందరి హస్తం కూడా ఆ పేలుళ్లలో ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది.
ఆత్మాహుతి దాడుల వల్ల మోక్షం లభిస్తుందని, పరలోకంలో హాయిగా జీవించవచ్చనే ప్రచారం వల్ల టెర్రరిస్టులుగా మారుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉందని పేర్కొంది. ఇలాంటి వారి అందరిలో మెదడు ఒక్క చోటే ఒత్తిడికి గురువుతోందని తెలిపింది. భారత్, పాకిస్థాన్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, పలస్తీనా, సిరియా, సోమాలియా, నైజీరియా ప్రాంతాల్లో టెర్రరిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిద సంస్థలకు చెందిన జిహాదీలు, కుర్దీష్‌లపైనే కాకుండా కాటలాన్ లాంటి స్వాతంత్య్రోద్యమాల్లో పాల్గొంటున్న తీవ్రవాదులపై కూడా పరిశోధనలు జరిపామని, వాటన్నింటిని ఇంకా క్రోడీకరించాల్సి ఉందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని వైద్య బందం తెలిపింది. సరైన కౌన్సిలింగ్ ద్వారా టెర్రరిస్టులను మార్చే అవకాశం ఉందని, అందుకు తమ ఈ అధ్యయనాలు తోడ్పడతాయని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment