56 బోగీలు మీద నుంచి పోయినా..
పురులియా(బెంగాల్): భూమి మీద నూకలు ఉండాలే గానీ పిడుగొచ్చి ఒళ్లోపడినా ప్రాణం పోదంటారు. సరిగ్గా పశ్చిమ బెంగాల్లో ఇలాగే జరిగింది. ఓ మహిళ పట్టాలు దాటుతుండగా అనూహ్యంగా గూడ్సురైలు దూసుకొచ్చింది. దాదాపు 56 బోగీలతో ఉన్న ఆ రైలు మీద నుంచే వెళ్లిన ఆ మహిళకు స్వల్ప గాయాలు కూడా అవలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగాల్ లోని పురూలియాలో హిమానీ మాంజి(45) అనే మహిళ తాతా నగర్ వెళ్లేందుకు తన ఇంటి నుంచి బయలు దేరింది.
రైలు ద్వారా ఆమె వెళ్లేందుకోసం స్టేషన్ కు బయలు దేరి పట్టాల గుండా నడవడం ప్రారంభించింది. పట్టాలుదాటేందుకు ప్రయత్నిస్తుండగా అనుకోకుండా కాళ్లకు రాళ్లు తగిలి రెండు పట్టాల మధ్యలో పడిపోయింది. ఈ లోగా వేగంగా గూడ్సు రైలు దూసుకొచ్చింది. దీంతో అక్కడే ఉన్న రైలు గార్డులు ఆమెను అప్రమత్తం చేసి అలాగే ఉండమని, పైకి లేవొద్దని, రైలు పూర్తిగా వెళ్లిపోయేవరకు అలాగే పడుకుని కదలకుండా ఉండమని సూచించారు. దీంతో ఆమె తన గుండె చేతపట్టుకొని కప్పలాగా ట్రాక్ మధ్యలో అతుక్కుపోయింది. అందరూ చూస్తుండగానే రైలు వచ్చి ఆమె పట్టాల మధ్యనఉండగా వెళ్లిపోయింది. అనంతరం రైలు వెళ్లాక రైల్వే సిబ్బంది ఇతర ప్రయాణీకులు ఆమెను పట్టాల నుంచి పైకి లేపి తీసుకొచ్చి పక్కనే సురక్షితంగా కూర్చొబెట్టారు.