
దుమ్ము రేపుతున్న చైనా టపాసులు
న్యూఢిల్లీ: తీవ్ర వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న చైనా టపాసులను దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినా వాటి దిగుమతులపై మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. పాకిస్తాన్‌కు అండగా ఉంటుందన్న కోపంతో చైనా అన్ని ఉత్పత్తులను దేశంలో బహిష్కరించాలంటూ సోషల్ మీడియా గత నెల నుంచి చేస్తున్న విస్తృత ప్రచారం కూడా ఈ టపాసుల దిగుమతులను మాత్రం అరికట్టలేకపోతుంది. దేశంలో ఏడాదికి 3,750 కోట్ల రూపాయల టపాసుల వ్యాపారం కొనసాగుతుండగా, అందులో చైనా టపాసులే 2,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసుకుంటున్నాయంటే అక్రమంగా వాటి దిగుమతులు ఏ స్థాయిలో సాగుతున్నాయో తెలిసిపోతోంది.
చైనా టపాసులను కాల్చడం వల్ల వాతావరణంలోకి అధిక మొత్తంలో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్ విడుదలవుతుందని, వీటి వల్ల ప్రజలకు శ్వాసకోశ, ఊపిరితిత్తుల జబ్బులు సంక్రమిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ కారణంగానే దేశంలోని వివిధ రాష్ట్రాలు చైనా టపాసుల దిగుమతులపై నిషేధం విధించాయి. ముఖ్యంగా అధిక కాలుష్యంతో బాధపడుతున్న ఢిల్లీ నగరం ఈ సారి చైనా దిగుమతులను అరికట్టేందుకు 11 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఢిల్లీతోపాటు ముంబై, చెన్నై, లూధియానా నగరాల గుండా దేశవ్యాప్తంగా చైనా టపాసులు రవాణా అవుతున్నాయి.
దీపావళిని దృష్టిలో పెట్టుకొని ఈ నెలలో జరిపిన దాడుల్లో 11 కోట్ల రూపాయల చైనా టపాసులను, ఈ ఏడాది మొత్తంగా 20 కోట్ల రూపాయల టపాసులను స్వాధీనం చేసుకున్నామని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వర్గాలు తెలియజేశాయి. ఏడాదికి రెండువేల కోట్ల రూపాయల చైనా టపాసుల వ్యాపారం జరుగుతుండగా, అందులో పట్టుకున్నది ఏ పాటిదని తమిళనాడు ఫైర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జీ అరిబూబెన్ వ్యాఖ్యానించారు. క్రీడా వస్తువులు, ఫర్నీచర్, పిల్లల ఆటబొమ్మలు, కాఫీ మగ్గుల కంటేనర్లలో చైనా టపాసులు దిగుమతి అవుతున్నాయని ఆయన అన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా సిండికేట్లు పని చేస్తున్నాయని ఆరోపించారు.
చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న టపాసులను దేశీయ మార్కెట్‌లో విక్రయించడం వల్ల 500 శాతం లాభాలు వస్తుండడంతో వీటి అక్రమ దిగుమతికి దేశానికి చెందిన వ్యాపారులు ఎగబడుతున్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని అస్సాం ఫైర్ వర్క్స్ వ్యాపారి తెలిపారు. చైనా టపాసుల్లో నాసిరకం పదార్థాలను వాడడం, అక్కడ చీప్ లేబర్ అందుబాటులో ఉండడం వల్ల ఆ టపాసులు తక్కువ ధరకు దొరకుతాయని ఆయన అన్నారు.
వాస్తవానికి చైనా నుంచి ఈ టపాసుల అక్రమ దిగుమతి ఏడాదంతా కొనసాగుతూ ఉంటుందని, అయితే అధికారులు మాత్రం దీపావళి పండుగ సందర్భంగానే దాడులు చేస్తుండడం వల్ల పెద్ద ప్రభావం లేకుండా పోతోందని ఆయన చెప్పారు. పెళ్లిళ్లు, కొత్త సంవత్సరం వేడుకలకు ఎక్కువగా చైనా టపాసులే అందుబాటులో ఉంటున్నాయని, ఒక్క దీపావళి సమయంలో తప్పిస్తే మిగతా సమయంలో దేశీయ మార్కెట్ నుంచి ఎలాంటి పోటీ ఉండదు కనుక చైనా టపాసుల వ్యాపారం జోరుగా సాగుతోందని వివరించారు. దీపావళి పండుగ ముగిసిన తర్వాత నుంచి చైనా నుంచి దిగుమతులు ప్రారంభమవుతాయని, తనకు తెల్సినంత వరకు ఏప్రిల్ నెలలో ఎక్కువ దిగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.