శుక్రవారం ముంబైలోని ఎల్ఫిన్‌స్టన్ రోడ్, పరెల్ సబర్బన్ రైల్వేస్టేషన్‌ను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట దృశ్యం
దసరా ముందురోజు ముంబైలో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. పరేల్ రోడ్, ఎల్ఫిన్‌స్టన్ రోడ్డు రైల్వే స్టేషన్లను కలిపే పాదచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జ్)పై శుక్రవారం ఉదయం భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకవైపు, భారీ వర్షం కారణంగా బయటకు వెళ్లలేక వంతెనపైనే నిలిచిపోయిన ప్రయాణికులు.. మరోవైపు, వరుసగా వచ్చిన రైళ్లలో నుంచి దిగి ఈ వంతెనపైకే వచ్చేస్తున్న వారితో ఇరుకైన ఈ వంతెన కిక్కిరిసిపోయి, తొక్కిసలాటకు దారితీసింది. ఈ హృదయవిదారక ఘటనలో 22 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన 30 మందిని ఆస్పత్రులకు తరలించారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ వేర్వేరుగా రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశించింది. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
సాక్షి, ముంబై: దసరా పండుగ వేళ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 10.40 గంటల సమయంలో ఎల్ఫిన్‌స్టన్ రోడ్, పరేల్ సబర్బన్ రైల్వే స్టేషన్లను కలిపే ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాటలో 22 మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన 22 మందిలో 8మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 22 మృతదేహాలను పరేల్‌లోని కేఈఎం ఆస్పత్రికి తరలించారు. రైల్వే, పోలీసు, అగ్నిమాపక దళం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మరోవైపు మరణించిన వారి కుటుంబ సభ్యులకు రైల్వే శాఖ రూ.5 లక్షలు, మహారాష్ట్ర ప్రభుత్వం మరో రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించాయి.
తొక్కిసలాటకు కారణాలేంటి?
ఈ రైల్వే స్టేషన్లకు సమీపంలోనే పలు కార్పొరేట్ సంస్థలు, మీడియా సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. పురాతనమైన ఈ వంతెన ద్వారా ప్రతి రోజు లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. శుక్రవారం ఉదయం కుండపోతగా వర్షం కురుస్తుండటంతో షెల్టర్ కోసం చాలామంది ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి చేరుకున్నారు. దీంతో వంతెన కిక్కిరిసిపోయింది. ఇదే సమయంలో కొన్ని సబర్బన్ రైళ్లు రావడంతో ప్రయాణికులు బయటకు వెళ్లేందుకు వంతెనపైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఉన్న కొద్ది ప్రాంతంలోనే ఎక్కువ మంది ఎక్కేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాటకు దారితీసింది. పలువురు రెయిలింగ్‌పైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకునే యత్నం చేశారు. కొంతమంది వంతెన పైనుంచి కిందికి దూకేయగా.. మరికొందరు రెయిలింగ్‌ను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఈ దారుణం జరిగిపోయింది. వంతెనపై ఉన్న వారిని కాపాడేందుకు ఏం చేయాలో తెలియక కింద ఉన్న వారు నిస్సహాయులై చూస్తూ ఉండిపోయారు. దీంతో బాధితుల అరుపులు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.
షార్ట్ సర్క్యూట్ జరిగిందా?
ఫుట్ ఓవర్ బ్రిడ్జి వర్షం వల్ల కిక్కిరిసిపోయిందని, వాన నీటి వల్ల వంతెనపై జారిపోయే పరిస్థితులు ఏర్పడి కొందరు పడిపోయారని, దీంతో ఆందోళన చెలరేగి తొక్కిసలాటకు దారి తీసిందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ అతుల్ శ్రీవాస్తవ చెప్పారు. వర్షం కురవడంతో ప్రయాణికులు స్టేషన్‌లోనే ఉన్నారని, వర్షం తగ్గగానే వారంతా బయటకు వెళ్లేందుకు ఒక్కసారిగా ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపైకి వచ్చారని, దీంతో తొక్కిసలాట జరిగిందని రైల్వే శాఖ అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా చెప్పారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ పేలుడు సంభవించడంతో జనం భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం: ముంబైలో వంద అదనపు సబర్బన్ రైళ్లను ప్రారంభించేందుకు శుక్రవారం ముంబై చేరుకున్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు నిమిత్తం పశ్చిమ రైల్వే చీఫ్ సేఫ్టీ అధికారి నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రైల్వే తరఫున రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామని తెలిపారు. ముంబైలో పరిస్థితిపై పీయూష్ గోయల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై రైల్వే శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుతాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందిస్తామన్నారు.
అసలేం జరిగింది..
శుక్రవారం ఉదయం దాదాపు పది గంటల సమయం.. భారీగా కార్పొరేట్ ఆఫీసులు, మీడియా సంస్థలు, మార్కెట్ సముదాయాలు నెలకొని ఉన్న పరేల్‌రోడ్, ఎల్ఫిన్‌స్టన్ రోడ్డు ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి కార్యాలయాలు, దుకాణాల్లో పని చేసే వారు సబర్బన్ రైళ్లలో ఇక్కడికి వచ్చి, తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకు చేరుకున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో.. తడిసిపోతామేమోనన్న భయంతో వారు వంతెనపైనే నిలబడిపోయారు. మరోవైపు, వరుసగా వస్తున్న రైళ్లలోనుంచి దిగిన ప్రయాణికులు కూడా గబగబా ఈ వంతెనపైకే వస్తున్నారు. ఇంకోవైపు, రైల్వేస్టేషన్లలోకి రావాలనుకునేవారూ ఈ వంతెన పైనే నిలిచిపోయారు. ఈ క్రమంలో వంతెన కిక్కిరిసిపోయింది.
ఇంతలో వంతెనపైనున్న ఒక వృద్ధుడు కిందపడిపోయాడు. ఆయననుపైకి లేపే క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయి, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇదే సమయంలో వంతెన కూలిపోతోందని, షార్ట్ సర్క్యూట్ జరిగిందని, బాంబు పేలిందని వదంతులు వ్యాపించడంతో తొక్కిసలాట తీవ్రమైంది. ఒకరిపై ఒకరు పడిపోయి, ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వందేళ్ల క్రితం నిర్మించిన ఈ పురాతన వంతెన ఇరుగ్గా (77అంగుళాలు మాత్రమే) ఉండటం, వర్షం వల్ల ఫ్లోర్ అంతా తడిసిపోయి ఉండటం కూడా తీవ్రత మరింత పెరగడానికి కారణమైంది.
ఈ వంతెన దాటడం యుద్ధమే!
ఒకప్పుడు బట్టల మిల్లులకు కేంద్రమైన(గిరాన్‌గావ్) ప్రాంతంలో ఇప్పుడు అద్దాల మేడలు, కార్పొరేట్ కార్యాలయాలు కొలువుదీరాయి. 1980–90 మధ్య కాలంలో పరేల్‌లో టెక్స్‌టైల్స్ మిల్లులను మూసేసిన తరువాత వాటి స్థానంలో ఆకాశహర్మ్యాలు, బ్యాంకులు, మీడియా సంస్థలను స్థాపించారు. జన సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది. ఇళ్ల నుంచి కార్యాలయలకు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే వేలాది మందికి పరేల్–ఎల్ఫిన్‌స్టన్ స్టేషన్లను కలుపుతున్న వంతెనే ఆధారం. వందేళ్ల క్రితం నిర్మించిన దాని వెడల్పు 77 అంగుళాలే. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయకపోగా, అదనంగా వంతెనలు నిర్మించలేకపోయారు. దీంతో ఉన్న ఒక్కదానిపై ఒత్తిడి తీవ్రమైంది. ప్రతి నిమిషం రెండు స్టేషన్లలో రైళ్లు దిగేవారు, ఎక్కే వారితో అది కిటకిటలాడుతోంది. వంతెనను దాటాలంటే ప్రయాణికులు ప్రతిక్షణం చిన్నపాటి యుద్ధం చేయాల్సి వస్తోందని స్థానికుడొకరు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది.
రోజూ లక్షలాది మంది రాకపోకలు సాగిస్తున్న ఈ వంతెన భద్రతను పట్టించుకోకపోవడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘ఉదయం, సాయంత్రం పూట ఇక్కడి రైల్వే స్టేషన్ల లోనికి వెళ్లేటపుడు, బయటికి వచ్చేటపుడు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది’ అని ఓ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్న అరుణ్ తివారీ తెలిపారు. ఆ ప్రాంతంలో కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు వెలిసిన తరువాత జనం కిక్కిరిసిపోయారని, అందుకు తగినట్లుగా మౌలిక వసతులు అభివృద్ధి చెందలేదన్నారు. ‘అభివృద్ధిని స్వాగతిస్తాం. బుల్లెట్ రైళ్ల కన్నా మెరుగైన మౌలిక వసతులు ముఖ్యం. కనీసం వంతెనల సంఖ్యనైనా పెంచాలి’ అని అక్కడి ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతి అన్నారు.
చేతులు కాలాక..
వంతెన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానం
22 మందిని బలిగొన్న ఎల్ఫిన్‌స్టన్ స్టేషన్ వద్ద అదనపు పాదచారుల వంతెన (ఎఫ్‌ఓబీ) నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానిస్తోంది. ప్రమాదం జరిగిన శుక్రవారమే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 40 అడుగుల పొడవు నిర్మించనున్న ఈ వంతెనను 2016 రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు. ముంబై సబర్బన్ ప్రాంతంలో రూ.45 కోట్ల బడ్జెట్‌తో చేపట్టబోయే ఎస్కలేటర్లు, ఎఫ్‌ఓబీలు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ప్రాజెక్టుల్లో ఇది అంతర్భాగం. రూ.9.5 కోట్ల వ్యయమయ్యే ఈ వంతెనను వచ్చే ఏడాది అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పశ్చిమ జోన్‌లోని ఆరు స్టేషన్లలో 12 చోట్ల ఎస్కలేటర్లు, భయాందర్, ఎల్ఫిన్‌స్టన్ రోడ్, కాందివిలి, ఖర్, విరార్ స్టేషన్లలో పాదచారుల వంతెనల ఏర్పాటుకు రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది.
‘బుల్లెట్’ కాదు భద్రత చూడండి
కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వంపై శివసేన, ప్రతిపక్షాల మండిపాటు
ఎల్ఫిన్‌స్టన్ వంతెన తొక్కిసలాట దుర్ఘటనపై బీజేపీ మిత్రపక్షం శివసేనతో పాటు ప్రతిపక్షాలు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రధాని కలల ప్రాజెక్టు అయిన బుల్లెట్ రైలుపై కాకుండా, స్టేషన్లలో ప్రయాణికుల భద్రత, ఇతర వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని సూచించాయి. ఈ ప్రమాదం ఊచకోతతో సమానమని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ తొక్కిసలాటకు ప్రభుత్వం, రైల్వే శాఖలదే బాధ్యత. పాత, శిథిలావస్థకు చేరిన పాదచారుల వంతెనలను నవీకరించాలని చాలాసార్లు కోరాం. కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. రైల్వే వ్యవస్థలో ఇప్పటికే రాజ్యమేలుతున్న లోపాలను సరిదిద్దలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం బుల్లెట్ రైలు ప్రవేశపెట్టడానికి తహతహలాడుతోందని ఎద్దేవా చేశారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించిన మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ చవాన్.. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముంబై రైల్వే స్టేషన్లపై పెరుగుతున్న ప్రయాణికుల ఒత్తిడి గురించి చర్చించేందుకు ప్రజా ప్రతినిధులు, రైల్వే శాఖ మధ్య సమావేశం ఏర్పాటుచేయాలని కేంద్రానికి లేఖ రాసినా, బదులు రాలేదని మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌పక్ష నేత రాధాక్రిష్ణ పాటిల్ తెలిపారు.
ఎంతో బాధించింది: రాష్ట్రపతి
‘తొక్కిసలాటలో అంతమంది చనిపోవడం నన్ను కలచివేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతులు. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. పరిస్థితిని సమీక్షించి, బాధితులకు సాయం అందేలా చూడటానికి రైల్వే మంత్రి గోయల్ ముంబై చేరుకున్నారు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య కూడా ఈ దుర్ఘటనపై ఆవేదన చెందారు. ‘ఈ ప్రమాదం గురించి విని షాక్‌కు గురయ్యా. బాధిత కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
నివారించదగినదే: సోనియా గాంధీ
ముంబై తొక్కిసలాట సంఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. సరైన ప్రణాళిక, భద్రతా ప్రమాణాలు పాటించినట్లయితే ఇలాంటి విపత్తులను
నివారించొచ్చని అన్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులెవరో తేల్చడానికి నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎల్ఫిన్‌స్టన్ ఘటన తనను కలచివేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.