
తలకిందులుగా వేలాడదీసి కొట్టి చంపేశారు..
పరిశ్రమలో పనిచేసే ఓ కార్మికున్ని యజమాని అత్యంత దారుణంగా కొట్టి అతని చావుకు కారణమయ్యాడు.
అమృత్ సర్: దొంగతనం నెపంతో ఓ వలస కూలీని యజమాని దారుణంగా హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.... పంజాబ్ లోని అమృత్ సర్ పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాక్టరీలో దొంగతనం చేశాడన్న నెపంతో బీహార్ కు చెందిన వలస కూలీ రాంసింగ్ను గురువారం ఉదయం ప్యాక్టరీ యజమాని జస్ప్రీత్ సింగ్ కిడ్నాప్ చేశాడు. అనంతరం తలకిందులు గా వేలాడదీసి ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు.
అయితే ఈ సంఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. 47 నిమిషాల నిడివిగల వీడియో బయటకు రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. సంఘటన జరిగిన మరుసటి రోజే రాంసింగ్ మృతదేహం లభించింది. ఈ దారుణానికి సహకరించిన మరో ఇద్దరిపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.