చెన్నై: సంతానలేమికి దంపతుల్లో ఎవరిలోకైనా లోపం ఉండవచ్చు. లోపాన్ని తెలుసుకుని తగిన చికిత్స ఇప్పించాల్సిన భర్తే విచక్షణ కోల్పోయాడు. సంతానం కల్గలేదని విషపు ఇంజక్షన్ ఇచ్చి భార్యను హతమార్చిన సంఘటన తమిళనాడులోని నామక్కల్‌లో చోటుచేసుకుంది. నామక్కల్‌కు చెందిన రాజేష్ (30) ఫార్మసీ దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి ప్రియ (20) అనే యువతితో రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇంతవరకు సంతానం కల్గలేదు. శనివారం ఉదయం ప్రియ నోటి నుంచి నురగలు వచ్చిన స్థితిలో ఇంట్లో శవమైపడి ఉండగా ఇరుగూ పొరుగూ వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి భర్త రాజేష్‌పై అనుమానించిన బంధువులు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
పరారీలో ఉన్న భర్తను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా, సంతానం కలగకపోవడంతో ప్రియను చంపేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. విషం ఎక్కించిన ఇంజక్షన్‌ను శుక్రవారం రాత్రి ఇంటికి తెచ్చి సంతానం లేనందున ఇద్దరం చనిపోదామని ప్రియకు చెప్పానని అన్నారు. ప్రియ అందుకు అంగీకరించకపోవడంతో బలవంతంగా ఆమెకు ఇంజక్షన్ ఇచ్చి హతమార్చినట్లు రాజేష్ అంగీకరించడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంతానం లేదని భార్యను చంపేశాడు
Published Sat, Oct 15 2016 7:38 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM