అతడు సంవత్సరంలో రెండుసార్లే స్నానం చేస్తాడు! | Husband showers only on Holi and Diwali; wife goes to police | Sakshi
Sakshi News home page

అతడు సంవత్సరంలో రెండుసార్లే స్నానం చేస్తాడు!

Published Thu, Mar 31 2016 9:19 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

అతడు సంవత్సరంలో రెండుసార్లే స్నానం చేస్తాడు! - Sakshi

అతడు సంవత్సరంలో రెండుసార్లే స్నానం చేస్తాడు!

లక్నోః తన భర్త ప్రతిరోజూ స్నానం చేయడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత ఘటన లక్నోలో వెలుగు చూసింది. సంవత్సరంలో వచ్చే హోలీ, దీపావళి సందర్భాల్లో మాత్రమే అతడు స్నానం చేస్తాడని అతడిని భరించలేక పోతున్నానని కంప్లైంట్ చేసింది. మానసిక, శారీరక వేధింపులను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసే ఎన్నోరకాల గృహ హింస కేసులను చూసిన వారికి ఈ కేసు వింతగానే అనిపించొచ్చు. కానీ దీన్ని కూడ హింసగానే భావించిన ఆమె సదరు భర్తపై ఫిర్యాదు చేసింది.

ఉత్తర ప్రదేశ్ లక్నో భాగ్పత్  ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ తనను భర్త వేధింపులనుంచి కాపాడమంటూ ఎస్పీ రవి శంకర్ కు ఫిర్యాదు చేసింది. తన భర్తవల్ల తన ప్రాణానికి ప్రమాదముందని తెలిపింది. ఇంతకూ భర్త ఆమెను ఎటువంటి వేధింపులకు గురి చేస్తున్నాడో ఆరా తీసిన పోలీసులు.. అసలు విషయం తెలియడంతో అవాక్కయ్యారు. తన భర్త సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తాడని, అదీ హోలీ, దీపావళి పండుగ రోజుల్లో మాత్రమే స్నానం చేస్తాడని, మిగిలిన రోజుల్లో స్నానం చేయమని ఎంత చెప్పినా వినిపించుకోడని సదరు మహిళ పోలీసులతో వాపోయింది. స్నానం విషయంలో భర్త మొండితనాన్ని భరించలేని ఆమె... అతడిపైనా, అతడి కుటుంబ సభ్యులపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడే కాక, అతడి ఇంట్లోనివారంతా ఇలాగే ప్రవర్తిస్తారని, ఏమాత్రం శుభ్రత పాటించరని ఆందోళన వ్యక్తం చేసింది.

కుటుంబ సభ్యులంతా గతేడాది దీపావళికి స్నానం చేశారని అప్పటినుంచీ తిరిగి స్నానం చేయమంటే చేయడం లేదని, పైగా శుభ్రత గురించి తమకు చెప్పాల్సిన పని లేదంటారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ బాధితురాలి బాధను విన్న పోలీసులు... కేసును మహిళా పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని ఎప్పీ రవిశంకర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement