సాక్షి, న్యూఢిల్లీ : మే 1, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని తెల్సిందే. మహారాష్ట్రకు సంబంధించి ఈ రోజుకు మరింత ప్రత్యేకత ఉంది. అదే రాష్ట్ర అవతరన దినోత్సవం. 1960లో సరిగ్గా ఈ రోజునే మహారాష్ట్ర అవతరించింది. దీనికోసం సాగిన ‘సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం’ను స్ఫూర్తిగా తీసుకొని దానిపై తీసీన వెబ్ సిరీస్ ‘హుతాత్మ (అమరవీరులు)’ను ఈ రోజు ‘జీ5’ ప్రసారం చేస్తోంది. జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి పాటిల్, వైభవ్ తత్వవాది, అభయ్ మహాజన్‌తోపాటు ప్రముఖ మరాఠీ నటులు అశ్విణి కల్సేకర్, మోహన్ అగశ్య్, సచిన్ ఖెడేకర్‌లు నటించారు. మీనా దేశ్‌పాండే రాసిన ‘హుతాత్మ’ మరాఠీ నవల ఆధారంగానే దీన్ని తెరకెక్కించారు.
బ్రిటీష్ కాలం నాటి బాంబే స్టేట్‌ను విడగొట్టి మరాఠీ భాషా ప్రాతిపదికన ప్రత్యేక మహారాష్ట్రను ఏర్పాటు చేయాలనే డిమాండ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఉంది. అయితే 1955లో తొలి రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఈ డిమాండ్ ఊపందుకుంది. పాలనాపరమైన సౌలభ్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్న ఆ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదనను వ్యతిరేకించింది. దాంతో ప్రత్యేక మహారాష్ట్ర సాధన కోసం కమ్యూనిస్టులు, సోషలిస్టులు, మేథావులు, సామాజిక కార్యకర్తలు ఏకమై ‘సంయుక్త మహారాష్ట్ర సమితి’ని ఏర్పాటు చేశారు. కేశవ్‌రావ్ జెఢే, ఎస్‌ఎం జోషి, ఆచార్య ఆత్రే, ప్రభోదాంకర్ థాకరే, శ్రీపాద్ అమృత్ డాంగే లాంటి మహుమహులు సమితి తరఫున ఉద్యమించారు. అదే సమయంలో బొంబాయి స్టేట్‌లో భాగంగా ఉన్న గుజరాతీలు కూడా మహాగుజరాత్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆర్థికంగా ఎంతో ముఖ్యమైన బొంబాయి నగరం రాజధానిగానే ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ రెండు ఉద్యమాలు కొనసాగాయి. 1955, 56 మధ్య ఈ ఉద్యమాల కోసం దాదాపు 100 మంది ప్రాణాలర్పించారు.
1955, నవంబర్ 21వ తేదీన దక్షిణ ముంబైలోని కోట వద్ద మహారాష్ట్ర ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడే అమరుల సంస్మరణార్థం ‘హుతాత్మ చౌక్’ ఏర్పడింది. మొదటి నుంచి భాషాప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకిస్తూ వస్తోన్న ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1959లో బొంబాయి రాజధానిగా మహారాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు. అలాగే ప్రత్యేక గుజరాత్ రాష్ట్రం ప్రతిపాదనను కూడా అంగీకరించిన ఆయన రాజధానిగా మరో నగరాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించారు. మతం ప్రాతిపదిక దేశం విడిపోవడాన్ని చూసిన నెహ్రూ, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అంగీకరిస్తే భాషల ప్రాతిపదికన దేశం ముక్కలవుతుందని భయపడ్డారట.
అప్పటి సీపీఐ నాయకుడు శ్రీపాద్ అమృత్ డాంగే సూచన మేరకు పండిట్ నెహ్రూ 1960, మే ఒకటవ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా మహారాష్ట్ర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావంతో ‘సంయుక్త మహారాష్ట్ర సమితి’ ఆధ్యాయం ముగిసింది. అయితే వలసలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రత్యేకంగా మరాఠీల గడ్డంటూ ప్రభోదాంకర్ థాకరే, ఆయన కుమారుడు బాల్ థాకరే నాయకత్వాన ‘శివసేన’ పేరిట కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. శివసేన అధికారికంగా ఏర్పాటయింది మాత్రం 1966లో. ‘హుతాత్మ’ వెబ్ సిరీస్‌లో ఈ వివరాలు ఏమేరకు ఉన్నాయో చూడాలి!
ఈ రోజు మహారాష్ట్రకు ఎంతో ప్రత్యేకం
Published Wed, May 1 2019 8:04 AM | Last Updated on Wed, May 1 2019 11:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment