ప్రధాని కావడానికి నేనే అర్హుడిని: ఆజంఖాన్
ప్రధానమంత్రి కావడానికి తానే అర్హుడినని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ రాజీనామా చేసి, ఎంపీలంతా తనను ఎన్నుకుంటే అది దేశానికి మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని, దేశం ప్రతిరోజూ పురోగతి సాధిస్తుందని ఆయన అన్నారు. ప్రధాని పదవికి తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా తనకే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు ఆయన తన పేరు ప్రతిపాదిస్తారన్నారు.
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆజంఖాన్ ఉండాలంటూ లక్నోలో పోస్టర్లు వెలుస్తున్న అంశాన్ని విలేకరులు ఆయనవద్ద ప్రస్తావించగా, ''మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాను. దానికి అన్నివిధాలా అర్హుడిని. అందుకే ఉపముఖ్యమంత్రి కావాలంటూ వెలిసిన పోస్టర్లను తీయించేశాను' అని చెప్పారు. ములాయంను ప్రధానిగా చేసి, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉప ప్రధాని చేస్తే రాబయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తాము సిద్ధమంటూ ఇటీవల అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. దాని గురించి ఆజం ఖాన్ వద్ద ప్రస్తావించగా, 'దేశ ప్రధాని కావడానికి అన్నివిధాలా నేనే అర్హుడిని. నేను ప్రధాని కావాలని అనుకుంటున్నా' అని కుండ బద్దలు కొట్టి చెప్పారు.