'అఖిలేశ్.. నీకెందుకీ మొండిపట్టుదల?'
లక్నో: అందరం కలిసి ఉండేందుకు తాము ఏం చేసేందుకైనా సిద్ధం అని సమాజ్ వాది పార్టీ నేత, ఎస్పీ కుటుంబంలో చిచ్చురేగడానికి కారణమైన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్ అన్నారు. ఎస్పీ కుటుంబం ఎప్పటికీ కలిసే ఉండాలని, అందుకోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా, బలిదానానికైనా తాను సిద్దంగా ఉన్నానని పరోక్షంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను వేడుకుంటూ అమర్ సింగ్ చెప్పారు. దాదాపు చీలిపోయిన ఎస్పీ భవితవ్యం రేపు ఎన్నికల కమిషన్ ముందు తేలనున్న నేపథ్యంలో అమర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
'నేను, ములాయం సోదరుడు శివపాల్ మట్టిలాంటి వాళ్లం. మమ్మల్ని శిల్పాలుగా తీర్చిదిద్దింది ములాయం సింగ్ యాదవ్. మేమిద్దరం ఆయనకు రెండు భుజాలలాంటివాళ్లం. అలాంటి నామీద, సోదరుడు శివపాల్ యాదవ్ మీద విషం చిమ్మారు. మనిద్దరివీ అద్దాల మేడలే. నేనూ ఆలోచిస్తా.. నువ్వు కూడా ఆలోచించాలి. ఇలాంటి సమయంలో నీ చేతిలో ఆ రాళ్లెందుకు? ఎందుకీ మొండి పట్టుదల? అసలు నువ్వెందుకు అలిగావు? ఇంట్లోని నిప్పువల్లే ఇంటికి మంట అంటుకుంది. మేం కలిసే ఉండాలనుకుంటున్నాం. నేను చేతులు జోడించి వేడుకోవాలనుకుంటున్నా.. ఇంకేం తీసుకోవాలనుకుంటున్నావు? రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. శివపాల్ యాదవ్ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కుటుంబం విడిపోకూడదని, మనమంతా ఒక్కటిగానే ఉండేందుకు మేం అన్నిరకాల త్యాగాలు, బలిదానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను రాజీనామా చేయడానికి ప్రయత్నించాను. ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నాను. అన్నిరకాల బలిదానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను' అంటూ అఖిలేశ్‌కు మీడియా ద్వారా అమర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
మరోపక్క, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కూడా స్పందిస్తూ 'ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నేతాజీ పుణ్యమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన వెంటే ఉంటాను' అని అన్నారు.