నేడైనా నల్లధనం వెలికితీతకు మోదీ ఉపక్రమిస్తారా!
న్యూఢిల్లీ: దేశ యువతను జాగృతం చేయడంతోపాటు హైందవ ధర్మాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన స్వామి వివేకానంద 153వ జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా మంగళవారం జాతి ఆయనకు ఘన నివాళి అర్పించింది. 'మహోన్నతుడైన వివేకానందుడికి సలాం' అంటూ స్వామీజీని తలుచుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
యోగా గురు రామ్ దేవ్ బాబా హరిద్వార్ లోని తన ఆశ్రమంలో వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నల్లధనంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'విదేశాల్లో భారత ఖ్యాతిని పెంచిన మహోన్నతుడు వివేకానందుడు. ఆయన జయంతి సందర్భంగానైనా నేడు నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోదీ కార్యాచరణ ప్రకటిస్తారనుకుంటున్నా' అని రామ్ దేవ్ అన్నారు. ఎన్నికల వాగ్ధానంలో ప్రధానమైనదైన నల్లధనం వెలికితీతకు బీజేపీ ప్రభుత్వం విశేష కృషి చేసినప్పటికీ, దాని ఫలాలు ఇంకా అందాల్సి ఉందని, ఆ మేరకు చర్యల్ని వేగవంతం చేసేలా ప్రధాని నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు యోగా గురు పేర్కొన్నారు.