
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌పై ఆర్జేడీ నేత మనోజ్ జా తీవ్ర విమర్శలు చేశారు. ఆర్మీ చీఫ్ ఎప్పుడు చూసినా మీడియాలోనే ఉంటున్నారని అన్నారు. వారాంతము 24గంటలపాటు ఆయన మీడియాలోనే నానుతున్నారని, ఇలాంటి ఆర్మీ చీఫ్‌ను తాను ఇంత వరకు చూడలేదని విమర్శించారు. గతంలో వచ్చిన ఆర్మీ చీఫ్‌లు ఎంతో చక్కగా పనిచేసేవారని, చాలా అరుదుగా మాత్రమే మీడియా ముందుకు వచ్చే వారని తెలిపారు. ఇప్పటి ఆర్మీ చీఫ్ కంటే కూడా బాగా పనిచేశారని చెప్పారు.
జమ్ముకశ్మీర్ పాఠశాలల తీరుపైన, విద్యార్థులు, కాలేజీ యువకులపైన బిపిన్ రావత్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో మనోజ్ జా స్పందించారు. రావత్ మాటలు వింటే జనాలు కంగారు పడతారని, అభద్రతా భావంలోకి వెళతారని, ఆయన అలా మాట్లాడకూడదని హితవు పలికారు. జమ్ముకశ్మీర్‌లో మొత్తం యువత తప్పుదారి పడుతోందని, అక్కడి మదర్సాలు కూడా అశాంతికి పరోక్షంగా కారణం అవుతున్నాయని, వాటిపై కొంత నియంత్రణ అవసరం అని అన్నారు. దీనిపై పలువురు విమర్శలు చేశారు.