నేను అమ్మింది అస్సాం టీ: మోదీ
మా పోరు గొగోయ్‌పై కాదు
టిన్సుకియా/బోకాఖాట్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి టీ అస్త్రాన్ని బయటికి తీశారు. అస్సాంకు ప్రత్యేక గుర్తింపైన టీపొడి ఉత్పత్తిదారులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర బ్రాండ్ టీపై పొడగ్తలు కురిపించారు. ‘గుజరాతీయుల్లో ఉత్సాహం నింపేందుకు అస్సాం టీనే అమ్మేవాడిని. అందుకే నాకు అస్సాంతో బలమైన బంధముంది’ అని అన్నారు. మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం టిన్సుకియా, మజూలీ, బిహుపురియా, బొకాఖాట్ ప్రాంతాల్లో జరిగిన సభల్లో పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ పాలనతో 60 ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బీజేపీకి ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. తను సీఎం తరుణ్ గొగోయ్‌కు వ్యతిరేకంగా పోరాడటం లేదని.. పేదరికం, అవినీతి, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపటమే బీజేపీ ఉద్దేశ్యమన్నారు. ‘నాకు మూడు ఎజెండాలున్నాయి. అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి. ఈ ఎన్నికలు ప్రధాని, సీఎంల మధ్య యుద్ధమని గొగోయ్ చెబుతున్నారు. గొగోయ్ నాకంటే చాలా సీనియర్. ఆయన ఆశీర్వాదాలు నాక్కావాలి. ఒక వ్యక్తితో పోరాడటం వల్ల నా సమయం వృథా చేసుకోదలచుకోలేదు. నా పోరాటం.. పేదరికం, నిరుద్యోగం, అవినీతి, విద్య లేకపోవటం, అనారోగ్యం, వెనకబాటుతనంపైనే’ అని మోదీ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్లపాటు ఇక్కడినుంచే ప్రాతినిధ్యం వహించినా ఈ రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినపుడు..అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అస్సాం ఒకటిగా ఉండేదని గుర్తుచేసిన మోదీ.. ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన వెనకబాటుకు గురైందన్నారు.
కళ్లముందు నీరున్నా తాగలేని స్థితి..
అస్సాంకు జలవనరులున్నా.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందకపోవటం బాధకలిగించిందని మోదీ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి భారీ నిధులిచ్చామన్నారు. రాష్ట్రంలో ఖడ్గమృగాలను చంపేవాళ్లను ప్రభుత్వం కాపాడుతోందని, వారందరికీ సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చిందని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు ఏప్రిల్ 4, 11 తేదీల్లో జరిగే ఎన్నికల్లో ఈవీఎంలలో బీజేపీ, కూటమి పార్టీల (అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్) సభ్యులకు ఓటేసి గెలిపించటం ద్వారా ప్రభుత్వానికి సరైన సమాధానం ఇవ్వాలని అన్నారు.