ఆ చాయ్ వాలా ఇచ్చిన కట్నం వింటే షాక్!
జైపూర్ : కూతుళ్ల పెళ్లి ఖర్చు భరించాలంటేనే కొంతమంది తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకు వస్తోంది. మరి కొంతమందైతే ఏకంగా లక్షలకు లక్షలు కట్నాలిచ్చి ఆడంభరంగా పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే ఓ చాయ్ వాలా ఒకేరోజు తన ఆరుగురు కూతుళ్లకి పెళ్లి చేసి, భారీ మొత్తంలో కట్నం ముట్టజెప్పి ఇరకాటంలో పడ్డాడు. పెళ్లి ఖర్చులుకాక, తన కూతుళ్లకు ఏకంగా కోటిన్నర కట్నమిచ్చాడు. చాయ్ వాలా ఏకంగా కోటిన్నర మేర కట్నమివ్వడంతో ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిదంటూ ఐటీ శాఖ వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
లీలా రామ్ గుజ్జర్.. రాజస్తాన్ లోని కొత్పుట్లీ సమీపంలోని హదుటా వద్ద ఓ టీ స్టాల్ నడుపుతున్నాడు. ఏప్రిల్ 4న తన ఆరుగురు కూతుర్లకు పెళ్లి చేశాడు. ఆ పెళ్లి వేడుకలో స్థానిక ప్రజలు, కమ్యూనిటీ నేతలు చూస్తుండగా పెద్దపెద్దగా నోట్లను లెక్కకడుతూ పెళ్లికొడుకులకు కట్నమిచ్చాడు. దీన్ని గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ బుధవారం రోజు ఆ చాయ్ వాలాకు నోటీసులు జారీచేసింది. ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి సంపాదించారో తెలపాలంటూ ఐటీ ఆఫీసు సమన్లు పంపింది.
''గురువారం వరకు మేం ఆగుతాం. ఒకవేళ రిటర్న్స్ ఫైల్ చేయడంలో అతను విఫలమైతే, ఆదాయార్జనపైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కట్నం లెక్కలో చూపని నగదుగా గుర్తిస్తే, తదుపరి ప్రక్రియను కొనసాగిస్తాం. ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సమర్పించాలని అతన్ని ఆదేశించాం'' అని ఓ సీనియర్ ఐటీ ఆఫీసర్ పేర్కొన్నారు. మరోవైపు నలుగురు మైనర్ కూతుళ్ల వివాహం కూడా గుజ్జర్ మెడకు చుట్టుకుంది. ఇద్దరి పెద్ద కూతుళ్ల పెళ్లికి మాత్రమే ఆహ్వాన పత్రికలు పంపి, మరో నలుగురు మైనర్ కూతుళ్లకి కూడా గుజ్జర్ వివాహం చేసినట్టు తెలిసింది. గుజ్జర్ ఇంటికి వెళ్లినప్పటికీ, వారి కుటుంబసభ్యులు ఎవరూ అక్కడ లేరని కొత్పుట్లీ పోలీసులు చెప్పారు.