
మరోసారి చిక్కుల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్
న్యూఢిల్లీ: పనామా పేపర్ల బహిర్గతం సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన ఆదాయపన్ను శాఖ ఇప్పటికే దాదాపు 33 మందిపై చర్యలకు ఉపక్రమించగా తాజాగా ఇతరులపై కూడా దర్యాప్తును వేగవంతం చేసింది. పనామా పేపర్స్‌లో పేర్లున్న మరికొందరి ‘పెద్దల’ వివరాలపై ఆదాయపన్ను శాఖ తీవ్రంగా కదులుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు మరోసారి ఇబ్బందులు తప్పడంలేదు. ఈ కేసులో బిగ్‌బీ సహా పలువురిపై సహా ఆదాయపన్ను శాఖ దృష్టి కేంద్రీకరించింది. పనామా పేపర్స్ లీక్ విచారణలో పురోగతి సాధించేందుకు గ్లోబల్ టాస్క్ ఫోర్స్‌లో చేరిన ఇండియా ఈ మేరకు అత్యున్నత స్థాయి బృందాన్ని కరేబియన్‌లోని బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్‌కు పంపింది.
పనామా పేపర్ల లీక్ వ్యవహారంలో విచారించేందుకు ఉన్నత స్థాయి అధికారులను బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌కు పంపించినట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు.సమాచారాన్ని సేకరించి, విశ్లేషించనున్నట్టు చెప్పారు. అయితే అమితాబ్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించినపుడు. ఈ ఆరోపణలను అమితాబ్ ఇప్పటికే ఖండించారని..పూర్తి సమాచారం వచ్చేంతవరకు విచారణ చేపట్టలేమన్నారు. సీనియర్ సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్స్) అధికారిని బ్రిటిష్ వర్జిన్ ద్వీపాలకు పంపించామనీ, వివిధ ఇతర దేశాలనుంచి దీనికి సంబంధించిన వివరాలను రాబడుతున్నట్టు తెలిపారు. అనంతరం ఈ మొత్తం సమాచారాన్ని విశ్లేషించి, ఉల్లంఘనలను పరిశీలించనున్నట్టు ఆయన చెప్పారు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ అని పనామా పేపర్స్‌లో పేర్లు బయటకి వచ్చిన వారిపై విచారణను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కాగా 35 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పనామాకు చెందిన న్యాయ సంస్థ మోస్సాక్ ఫోన్సెకా ద్వారా ఈ పనామా కీలక పత్రాలు లీక్ అయ్యాయి. ఇది 1977- 2015 మధ్యకాలంలో 2,14,000 ఆఫ్షోర్ సంస్థలకు సంబంధించిన 11.5 మిలియన్ పత్రాలను కంపెనీ లీక్ చేసింది. విదేశీ బ్యాంక్ ఖాతాలున్న 50 దేశాల నుంచి 140 రాజకీయ వ్యక్తుల పేర్లను బహిర్గతం చేసింది. వీటిలో వివిధ దేశాల 12 మంది ప్రస్తుత లేదా మాజీ అధిపతులు, అలాగే క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సినీతారలు సహా, ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న 29 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇదే కేసులో పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.