న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్లలో అనుమానాస్పద ఆదాయ పన్ను రీఫండ్ క్లెయిమ్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాజ్యసభకు తెలిపారు. 2016–17లో 9,856గా ఉన్న ఈ సంఖ్య 2018–19 నాటికి 20,874కి చేరిందన్నారు. ఆదాయం, పెట్టుబడులకు పొంతన లేకుండా భారీ రీఫండ్స్ కోసం క్లెయిమ్ చేస్తున్న పన్ను చెల్లింపుదారుల రిటరŠన్స్‌పై ఆదాయ పన్ను శాఖ స్క్రూటినీ జరుపుతోందని మంత్రి వివరించారు.
స్క్రూటినీ అనంతరం క్లెయిమ్ తప్పని తేలిన పక్షంలో కేసును బట్టి రీఫండ్‌ను నిరాకరించడంతో పాటు జరిమానా, ప్రాసిక్యూషన్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. 2015–16లో రూ. 1.22 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ రీఫండ్స్ 2018–19 నాటికి రూ. 1.43 లక్షల కోట్లకు పెరిగాయని ఆయన వివరించారు. అనుమానాస్పద క్లెయిమ్స్‌కు ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరగకుండా పక్కకు తీసి పెట్టేలా ఐటీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. మరోవైపు, 2017–18లో 4.63 కోట్ల ఐటీ రిటర్న్‌లు దాఖలు కాగా 2018–19 జనవరి నాటికి ఇది 37% పెరిగి 6.36 కోట్లకు చేరిందని చెప్పారు. 2018–19లో ఐటీఆర్‌లు గడువులోగా ఫైల్ చేయాలంటూ పన్ను చెల్లింపుదారులకు 25 కోట్ల పైచిలుకు ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్ పంపినట్లు శుక్లా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment