
సాక్షి,న్యూఢిల్లీ: పార్టీకి అందిన రూ 30 కోట్ల విరాళాలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన నోటీసులపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. తమ పార్టీ స్వీకరించిన విరాళాలపై అన్ని వివరాలు ఖాతాల్లో నమోదయ్యాయని, ఐటీ నోటీసులు రాజకీయ కుట్రలో భాగమేనని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఐటీ చట్టం సెక్షన్ 156 కింద నోటీసులు జారీ చేశామని ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి.
పార్టీ దాఖలు చేసిన ఐటీఆర్‌లను పరిశీలించిన అసెసింగ్ అధికారి సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారని పేర్కొన్నాయి. ఇతర సంస్థలకూ ఈ తరహా నోటీసులు జారీ చేశామని, ఆప్‌కు విరాళాలు సహా పలు మార్గాల్లో వచ్చిన ఆదాయంపై వివరణ కోరుతూ డిమాండ్ నోటీసు పంపామని ఐటీ వర్గాలు తెలిపాయి.