
'దళితుణ్ని కాబట్టే బలిచేశారు'
అసెంబ్లీలో బలనిరూపణకు కొద్ది గంటల ముందు బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జీతన్ రాం మాంఝీ జేడీయూ అగ్రనాయకత్వం పై విరుచుకుపడ్డారు. మహాదళిత వర్గానికి చెందిన వాడినైనందునే తనను రాజకీయంగా బలిచేశారని జేడీయూపై దుమ్మెత్తి పోశారు. తనకు మద్దతు పలికేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలను జేడీయూ నాయకులు భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. నితిశ్ కుమార్ రిమోట్ కంట్రోల్ పాలనకు యత్నించారని, అందుకు నిరాకరించినందుకే తనపై కక్షగట్టారన్నారు.
శుక్రవారం జరగాల్సిన బలపరీక్షకు తగిన ఏర్పాట్లు చేయకుండా స్పీకర్ ఉదయ్ నారాయణ్ కుట్రపూరితంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునే అవకాశం లేకపోవడంతో బలపరీక్షకు ముందే సీఎం పదవికి మాంఝీ రాజీనామా చేశారు. మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని చూస్తున్న నితీష్ కుమార్ను గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ రాజ్భవన్కు ఆహ్వానించారు. ఆదివారం బీహార్ ముఖ్యమంత్రిగా నితిశ్ కుమార్ ప్రమాణం చేయనున్నారు.