ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుంటా!: ఎంపీ
భోపాల్: సమాజ్ వాదీ పార్టీ ఎంపీ చౌధరీ మనవార్ సలీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ హై కమిషన్ అధికారితో తనకు సంబంధాలు ఉన్నాయని నిఘా విభాగాలు నిరూపిస్తే కుటుంబంతో సహా తాను ఆత్మహత్య చేసుకుంటానని శనివారం రాత్రి ఆయన అన్నారు. పీఏ అరెస్ట్ పై సలీమ్ స్పందిస్తూ.. తాను ఢిల్లీ పోలీసులతో సహా మూడు సంస్థలు ఎంక్వయిరీ చేసిన తర్వాతే ఫర్హాత్ ను తన వద్ద జాయిన్ చేసుకున్నానని చెప్పారు. కొన్ని రోజుల కిందట గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మహ్మద్ అక్తర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం ఎస్పీ ఎంపీ సలీమ్ వ్యక్తిగత కార్యదర్శి ఫర్హాత్ ను అరెస్ట్ చేశారు. పాక్ హై కమిషన్ ఉద్యోగి అక్తర్ తో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఎంపీ పీఏను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫర్హాత్ కు తాను రెండు లక్షల రూపాయలు చెల్లించాలని పాక్ గూఢచారి అక్తర్ పోలీసుల విచారణలో తెలిపాడు. మధ్యప్రదేశ్ లో తమ పార్టీ రాజకీయాల్లో కీలకవ్యక్తి అయిన సలీమ్ ను ఎస్పీ అధినేత ములాయం సింగ్ 2012లో రాజ్యసభకు ఎంపిక చేశారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో ముస్లింల ఓట్లను సంపాదించడానికి ఆయనకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఒకవైపు ఉత్తరప్రదేశ్ లో పార్టీలో కీలకనేతల మధ్య రాజకీయ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఎస్పీకి చెందిన ఓ ఎంపీ గూఢచర్యం లాంటి పెద్ద సమస్యలో చిక్కుకోవడం గమనార్హం.