రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారని వస్తున్న వార్తలకు బీజేపీ సీనియర్ నేత అద్వానీ ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారని వస్తున్న వార్తలకు బీజేపీ సీనియర్ నేత అద్వానీ ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. అదే తన మదిలో ఉన్న ఆలోచన అని తేల్చి చెప్పారు. ‘‘నేను ఏమీ చెప్పలేదు (రాజ్యసభకు పోటీపై). నాకెవరైనా ఆ సూచన చేస్తే ఆలోచిస్తాను. అది సర్వసాధారణం కూడా. నాకు ఆ ఆలోచన ఉంటే ముందే ఆచరించి ఉండేవాడిని’’ అని ఇక్కడ ఆయన నివాసంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చెప్పారు. తాను లోక్‌సభకు పోటీ చేసే ఆలోచనలో మాత్రమే ఉన్నానని సమాధానమిచ్చారు. అయితే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పోటీ లేకుండా చేసేందుకు అద్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోందని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రపతి గణతంత్ర సందేశంపై అద్వానీ మాట్లాడుతూ.. స్థిరమైన ప్రభుత్వ అవసరాన్ని రాష్ట్రపతి నొక్కి చెప్పారన్నారు.