
యశవంతపుర (బెంగళూరు): ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన గౌతం 2008లో జాతీయ స్థాయిలో సివిల్స్‌లో 23వ ర్యాంక్‌ను సాధించి 2009లో కర్ణాటక బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా వచ్చారు. ప్రస్తుతం ఆయన కర్ణాటకలోని దావణగెరె జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే జిల్లాకు పంచాయతీ సీఈవోగా పనిచేస్తోన్న కేరళకి చెందిన అశ్వథితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మరో ఐఏఎస్ అధికారి మధ్యవర్తిత్వంతో ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. ఈ నెల 14న కేరళలోని క్యాలికట్‌లో వీరి వివాహం జరగనుంది. 17న గౌతం స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహిస్తారు.