పుణేలో ఒక ఉన్నతాధికారి అన్నెంపున్నం ఎరుగని అమాయక బాలికలను లైంగికంగా వేధించి, అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పుణె: పుణేలో ఒక ఉన్నతాధికారి అన్నెంపున్నం ఎరుగని అమాయక బాలికలను లైంగికంగా వేధించి, అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర వ్యవసాయరంగ బోధన మరియు పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్ గా పదవి వెలగబెడుతున్న 58 ఏళ్ల ఎం.హెచ్. సావంత్ (ఐఏఎస్)ను పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం స్థానిక శివాజీ నగర్లో ఉండే సావంత్ ..ఒక పథకం ప్రకారమే హింగనకుంద్లో ఉండే తన మామగారింటికి తరచూ వెళ్లేవాడు. అక్కడికి సమీపంలోని స్కూలునుంచి హౌసింగ్ సొసైటీ పార్క్కు ఆటుకోడానికొచ్చే బాలికలే అతని టార్గెట్.
పదేళ్ళలోపు అమాయకపు బాలికలను చాకెట్లు, డబ్బులుతో మభ్యపెట్టి ఇంటికి తీసుకొచ్చేవాడు. కంప్యూటర్లో అశ్లీల చిత్రాలు చూపించి.. అఘాయిత్యానికి పాల్పడేవాడని సింగద్ పోలీస్ స్టేషన్ ఎస్సై బల్వంత్ కషీద్ తెలిపారు. అయితే ఈ దారుణాన్ని తమ స్కూల్ కౌన్సిలర్ ద్వారా తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్థానిక కార్పొరేటర్, అతని భార్య సహకారాన్నికూడా తీసుకుంది స్కూలు యాజమాన్యం. గురువారం సావంత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం తరలించి, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్యపరీక్షల అనంతరం నిందితుడిని కోర్టుకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.