జమ్ముకశ్మీర్‌లో 40 మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడి సూత్రధారి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.భారత్‌పై ఎన్నో భీకర దాడులకు పాల్పడిన అజర్ గతంలో ఒకే ఒక్కసారి అరెస్ట్ అయ్యాడు. 1994–99 మధ్య కాలంలో జమ్ములోని కోట్ భల్వాల్ జైలులో అయిదేళ్లు ఊచలు లెక్కపెట్టాడు. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి అవినాశ్ మోహననే అజర్‌ను ప్రతీరోజూ విచారించేవారు. ఆ విచారణలో అజర్ మనస్తత్వాన్ని బాగా పసిగట్టారు. అజర్‌ను విచారించడం అత్యంత సులభమని, ఆర్మీ అధికారి ఒక్క చెంప దెబ్బకొట్టగానే, పాక్‌లో టెర్రరిస్టు గ్రూపుల గురించి, ఐఎస్‌ఐ గుట్టుమట్లు గురించి పూసగుచ్చినట్టు చెప్పేశాడని అవినాశ్ వెల్లడించారు.
గొప్పలు ఎక్కువ
మసూద్ అజర్‌కి గొప్పలు ఎక్కువ. తన గురించే ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. పాకిస్తాన్, ఐఎస్‌ఐ తనకెంత ప్రాధాన్యత ఇస్తుందో కథలు కథలుగా చెప్పేవాడు, తనని ఎక్కువ కాలం ఎవరూ కస్డడీలో ఉంచలేరని ధీమాగా గడిపేసేవాడు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టడంలో మసూద్‌కి మించిన వాడు లేడని పేరుంది.. కశ్మీర్‌లో జిహాదీని ప్రోత్సహించే సామర్థ్యం ఉన్న వాడు కనుకే అతనికి ఐఎస్‌ఐ అండదండలు పుష్కలంగా ఉన్నాయని అవినాశ్ అభిప్రాయపడ్డారు.
తీగలాగితే చాలు..
కాస్త కదిలిస్తే చాలు అజర్ అనర్గళంగా మాట్లాడేవాడు. ఒక చిన్న ప్రశ్న వేస్తే చాలు..ఎన్నో విషయాలను వివరించేవాడు.పాక్ గడ్డపై ఉగ్రవాద మూకలు ఎలా పనిచేస్తాయి ? వారి నియామకం ఎలా జరుగుతుంది ? పాక్ గూఢచర్య ఐఎస్‌ఐ ఎలాంటి కుట్రలు పన్నుతుంది.. ఇలాంటి విషయాలన్నీ సమగ్రంగా వివరించేవాడు. ఆప్ఘన్ టెర్రరిస్టులు కశ్మీర్ లోయలోకి ఎలా ప్రవేశిస్తారో, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామిలను విలీనం చేసి హర్కల్ ఉల్ అన్సర్ సంస్థ ఎలా ఏర్పడిందో వంటి విషయాలన్నీ వివరించాడు. తన స్వార్థం కోసం ఎంతదూరమైనా వెళతాడు అజర్.
అనూహ్యంగా అరెస్ట్
అసలు అతను అరెస్ట్ కావడమే చాలా అనూహ్యంగా జరిగింది. హర్కత్ ఉల్ అన్సర్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఉండే అజర్ తమ సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ సజ్జాద్ అప్ఘనీని కలుసుకోవడానికి 1994లో ఫిబ్రవరి 11న అనంతనాగ్ జిల్లాలోని కప్రాన్ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. వాళ్లిద్దరూ కలిసి ఒక ఆటోలో తప్పించుకోబోయారు. గస్తీ పోలీసులు ఆటోని ఆప్పినప్పుడు ఇద్దరూ కలిసి పరుగులు తీశారు9. దగ్గరలో ఉన్న ఆర్మీ పికెట్‌కు చెందిన సైనికులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. అటు సజ్జాద్ అప్ఘని తాను పట్టబడడానికి అజర్ కారణమని భావించాడు. జైల్లో ఉన్నన్నాళ్లూ వారిద్దరికి ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టేది కాదు.
సొంత సంస్థపైనే విమర్శలు
అజర్ తన సొంత సంస్థపైనే విమర్శలు గుప్పించేవాడు. కశ్మీర్‌లో పరిస్థితులపై తన సంస్థ తప్పుదారి పట్టించడం వల్లే తాను అరెస్ట్ అయ్యానని విచారణలో వెల్లడించాడు. ‘అప్ఘనిస్తాన్ తరహా పరిస్థితుల్ని నేను కశ్మీర్‌లో ఊహించుకున్నాను. ముజాహిదీన్ గ్రూపులు హాయిగా స్వేచ్ఛగా ఆప్ఘన్, పాక్ మధ్య ఎలా ప్రయాణం చేస్తాయో, కశ్మీర్ నుంచి పాక్‌కు అలాగే రావచ్చునని అనుకున్నాను. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. భారత భద్రతా దళాల నుంచి తప్పించుకోవడానికి ముజాహిదీన్లు పరుగులంకించుకునే దృశ్యాలే కనిపించాయి. నా సొంత ఉగ్రవాద సంస్థ నన్ను తప్పుదోవ పట్టించడం వల్లే అరెస్ట్ అయ్యాను‘‘ అని అజర్ ఆ విచారణలో వివరించాడు.
అహం ఎక్కువ
అరెస్టయిన తనని బయటకు రప్పించడంలో జాప్యం జరగడం, అయిదేళ్లు జైలు నాలుగు గోడల మధ్య మగ్గిపోవడంతో అజర్ అహం దెబ్బ తింది. దీంతో తనను ప్రోత్సహించిన మాతృ సంస్థ హర్కత్ ఉల్‌పైనే కక్ష గట్టాడు. 1999లో ఖాట్మండు నుంచి న్యూఢిల్లీకి రావాల్సిన ఐసీ–814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆప్ఘన్‌లో కాందహార్‌కు తీసుకువెళ్లారు. అందులో ప్రయాణికుల్ని సురక్షితంగా విడిపించుకోవడం కోసం అప్పట్లో అధికారంలో ఉన్న ఎన్టీయే సర్కార్ మసూర్ అజర్, ఒమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్ వంటి వారిని జైలు నుంచి విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తాను సొంతంగా జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. పాక్ ఐఎస్‌ఐ కూడా ఉగ్రవాద సంస్థలన్నింటిపైనే అతనికి అధికారాలు ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ తనకు అన్నం పెట్టిన హర్కత్ ఉల్‌పై ఎలాంటి కృతజ్ఞతాభావం లేకుండా ఎక్కువ మంది కేడర్‌ను తనవైపు లాగేశాడు. భారత్‌పై విజేతగా నిలిచించి తానక్కొడినేనని విర్రవీగేవాడు.
ప్రస్తుతం ఐఎస్‌ఐ రక్షణలో
మసూద్ అజర్ భారత్‌పై ఎన్నో దాడులకు తెగబడ్డాడు. పార్లమెంటు, పథాన్‌కోట్ ఎయిర్‌బేస్, జమ్ము, ఉరీలో సైనిక శిబిరాలపై దాడుల వెనుక అతని హస్తం ఉంది.
కరాచి నుంచి వెలువడే టాబ్లాయిడ్ సజాదే ముజాహిద్ జర్నలిస్టుగా 1993లోనే అతను ఇతర విలేకరుల బృందంతో కలిసి ఎన్నో దేశాలు తిరిగి కశ్మీర్ అంశంలో మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో బహవాయిపూర్‌లోని ఒక కలుగులోఎలుకలా దాక్కున్న అజర్‌ని అనుక్షణం పాక్ ఐఎస్‌ఐ కంటికి రెప్పలా కాపలా కాస్తూ ఉంటుంది. ఏదో విధంగా అజర్‌ను పట్టుకొని భారత్‌కు తీసుకువచ్చి విచారణ జరపాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్
చెంప దెబ్బకొట్టగానే ఐఎస్‌ఐ గుట్టుమట్లు చెప్పేశాడు
Published Wed, Feb 20 2019 6:11 PM | Last Updated on Wed, Feb 20 2019 6:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment