ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ టీకా ప్రయత్నాలపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) శనివారం ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ తయారీకి ‘భారత్ బయోటెక్’కు అనుమతి ఇచ్చామని.. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఆ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తోందని పేర్కొంది. దేశ ప్రజల ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని వేగవంతంగా వ్యాక్సిన్ తయారీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. లోతైన పరిశీలన, డేటా విశ్లేషణ తర్వాతే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అనుమతిస్తామని స్పష్టం చేసింది. (కరోనా ‘కోవాక్సిన్’పై కొత్త గొడవ)
కాగా కరోనా మహమ్మారి కట్టడికి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ను మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిన విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే వారు జూలై 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా కోవాక్సిన్‌ను ఆవిష్కరించాలంటూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ గురువారం లేఖ రాయడం పట్ల వైద్య నిపుణులు, పరిశోధనా వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అదే విధంగా మానవులపై ట్రయల్స్ జరగకముందే వ్యాక్సిన్ విడుదలకు తేదీని ఎలా ఖరారు చేస్తారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం ఈ మేరకు స్పందించిన ఐసీఎంఆర్.. భారత్ బయోటెక్ ప్రీ క్లినికల్ డేటాను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డ్రగ్స్ కంట్రోలర్ అనుమతించారని ప్రకటన విడుదల చేసింది. (కరోనా: 7నుంచి నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్)
Comments
Please login to add a commentAdd a comment