![ICMR Nivedita Gupta On Corona Testing Capacity - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/2/Nivedita-Gupta.jpg.webp?itok=29H6zFxJ)
న్యూఢిల్లీ : కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచడానికి స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తున్నట్టు ఐసీఎంఆర్ శాస్త్రవేత్త నివేదిత గుప్తా తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 681 ల్యాబొరేటరీలలో రోజుకు 1.2 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. అందులో 476 ప్రభుత్వ, 205 ప్రైవేటు లాబోరేటరీలు ఉన్నట్టు చెప్పారు. మంగళవారం కరోనాపై మీడియా సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ట్రూనాట్ స్ర్కీనింగ్, నిర్ధారణ పరీక్షలు ధ్రువీకరించబడ్డాయని చెప్పారు. జిల్లాల్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. టెస్ట్‌ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
73 శాతం మందికి ఇతర ఆరోగ్య సమస్యలు.. : లవ్ అగర్వాల్
దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి 95,527 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. భారత్‌లో కరోనా రికవరీ రేటు 48.07 శాతంగా ఉందన్నారు. కరోనాపై మీడియా సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కరోనా మరణాల రేటు 2.82 శాతంగా ఉందని వెల్లడించారు. ఇది ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. దేశంలో కరోనాతో మృతిచెందిన వారిలో 73 శాతం మందికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాల వారీగా కరోనా కేసుల తీవ్రతపై విశ్లేషణ జరపాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment