కోల్‌కతాలో ఓ కూరగాయల దుకాణంలో ‘మాస్క్ పెట్టుకుని వస్తేనే కూరగాయాలు అమ్ముతాం’ అనే ప్లకార్డులతో కరోనా రక్కసి దిష్టిబొమ్మను ఏర్పాటుచేసిన దృశ్యం
న్యూఢిల్లీ/జైపూర్: కరోనా వైరస్ సోకిందో, లేదో వేగంగా నిర్ధారించే ‘రాపిడ్ టెస్టింగ్ కిట్స్’ను రెండు రోజుల పాటు వాడవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మంగళవారం రాష్ట్రాలను కోరింది. చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో ఆ కిట్స్ పనితీరును పరీక్షించి, అనంతరం రాష్ట్రాలకు వాటి వినియోగంపై సూచనలు చేస్తామంది. నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని తేలితే, ఆ కిట్స్‌కు బదులుగా, సంబంధిత సంస్థను వేరే కిట్స్‌ను సరఫరా చేయాలని కోరుతామన్నారు. ‘ఒక రాష్ట్రం నుంచి ఈ విషయమై ఫిర్యాదు వచ్చింది. వేరే 3 రాష్ట్రాలతో మాట్లాడాము. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఫలితాలకు, ల్యాబ్ పరీక్షల ఫలితాలకు మధ్య తేడాలు వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. అందువల్ల రెండు రోజుల పాటు ఆ కిట్స్ వాడవద్దని రాష్ట్రాలకు సూచించాం’అని ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ చెప్పారు.
ఈ వ్యాధిని గుర్తించి మూడున్నర నెలలే గడిచినందున నిర్ధారణ పరీక్షల తీరును మెరుగుపర్చాల్సి ఉందన్నారు. కేసులు రెట్టింపయ్యే సమయం గణనీయంగా పెరిగిందని, అందువల్ల భారీగా కేసులు నమోదయ్యే పరిస్థితి రాకపోవచ్చని పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్ ప్రకటించింది. ఆ కిట్స్ ద్వారా జరిపిన పరీక్షల్లో 90% çసరైన ఫలితాలు రావాల్సి ఉండగా.. 5.4% మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు తేలిందన్నారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ దృష్టికి తీసుకు వెళ్లామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు తెలిపారు. ల్యాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినవారికి ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా జరిపిన పరీక్షలో నెగటివ్ వస్తోందన్నారు.‘ఇవి చైనాలో తయారైన కిట్స్. ఐసీఎంఆర్ ఉచితంగా 30 వేల కిట్స్‌ను రాష్ట్రానికి ఇచ్చింది. అదనంగా 10 వేల కిట్స్‌ను కొనుగోలు చేశాం’అని రాజస్తాన్ అదనపు చీఫ్ సెక్రటరీ రోహిత్ తెలిపారు. ఈ కిట్స్ రక్త పరీక్ష ద్వారా, అత్యంత తక్కువ సమయంలో కరోనాను నిర్ధారిస్తాయి. ఈ కిట్స్ ద్వారా పాజిటివ్‌గా తేలిన వారికి మళ్లీ ల్యాబ్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు.
లోక్‌సభ సెక్రెటేరియెట్ ఉద్యోగికి కరోనా
లోక్‌సభ సెక్రెటేరియెట్‌లో పారిశుధ్య విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు చెప్పారు. అతడు గత వారం రోజులుగా విధులకు హాజరు కావడం లేదని తెలిపారు.
19 వేలకు చేరువలో..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య మంగళవారం సాయంత్రానికి 18,985కి, మరణాల సంఖ్య 603కి చేరింది. సోమవారం సాయంత్రం నుంచి 24 గంటల వ్యవధిలో 1,329 కేసులు, 44 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో 11 రాజస్తాన్‌లో, 10 గుజరాత్‌లో, 9 మహారాష్ట్రలో, 3 యూపీలో, 2 చొప్పున ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ల్లో, ఒకటి కర్ణాటకలో సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 3,259 మంది కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని మంగళవారం వెల్లడించింది. 17% పైగా పేషెంట్లు కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 232 మరణాలు చోటు చేసుకున్నాయి. కేసులవారీగా కూడా మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 4,669 కేసులు నమోదయ్యాయి.
కరోనాపై టెలిఫోనిక్ సర్వే
కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు టెలిఫోన్ సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ టెలిఫోన్ సర్వేలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చింది. 1921 అనే నంబర్ నుంచి ఫోన్ వస్తుందని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. ఇలాంటి సర్వే పేరుతో ఇతర నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని సూచించింది.
► ఇప్పటివరకు చేస్తున్న పాలిమెరేజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్) పరీక్షల్లో గొంతు, ముక్కులో నుంచి తీసిన శాంపిల్‌ను పరీక్షించి, కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. అయితే, ఈ విధానంలో ఫలితాలు వచ్చేందుకు 5– 6 గంటల సమయం పడుతుంది. కానీ రక్త పరీక్ష ద్వారా జరిపే రాపిడ్ యాంటీబాడీ టెస్ట్‌లో ఫలితం అరగంటలోపే వచ్చేస్తుంది. హాట్‌స్పాట్స్‌లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
► గతవారం ఐదు లక్షల కిట్స్‌ను ఐసీఎంఆర్ చైనాకు చెందిన రెండు సంస్థల నుంచి కొనుగోలు చేసి, కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న రాష్ట్రాలకు పంపించింది.
► చైనా ఉత్పత్తుల్లో నాణ్యతాపరమైన లోపాలున్నట్లు వస్తున్న వార్తలపై గతవారం చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జి రాంగ్ స్పందిస్తూ అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేసేలా తమ దేశంలో కఠినమైన నిబంధనలున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment