న్యూఢిల్లీ: మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా(కోవిడ్-19) మహమ్మారికి విరుగుడు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చి క్లినికల్ ట్రయల్స్ సైతం నిర్వహిస్తుండగా.. మరికొన్ని దేశాల్లో టీకాను కనుగొనేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. అయితే ఇంతవరకు కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యుక్రమాన్ని ఎవరూ పూర్తిస్థాయిలో విశ్లేషించలేకపోయారు. ఇక చైనీస్ శాస్త్రవేత్తలు మాత్రం గబ్బిలాల్లోని ఆర్‌ఎమ్‌వైఎన్‌ఓ2 జన్యుక్రమం, హెచ్‌సీఓవీ-19(కోవిడ్-19) జన్యుక్రమంతో దాదాపు 93 శాతం సరిపోలిందని గతంలో వెల్లడించారు. జన్యు పునఃసంయోగాల(జీన్ రీకాంబినేషన్) వల్లే కరోనా పుట్టిందని అంచనా వేశారు. తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎమ్‌ఆర్)చేసిన అధ్యయనంలోనూ ఇదే తరహా కీలక విషయాలు వెల్లడయ్యాయి.(కరోనా వ్యాక్సిన్‌పై పరీక్షలు షురూ..)
రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీపీసీఆర్) ద్వారా రెండు భిన్న రకాల గబ్బిలాలపై పరిశోధనలు జరిపినట్లు ఐసీఎమ్‌ఆర్ వెల్లడించింది. దీని ఆధారంగా రౌసెట్టస్, టెరోపస్ రకాకలు చెందిన గబ్బిలాల్లో కరోనా వైరస్ బయటపడినట్లు వెల్లడించింది. ఇక టెరోపస్ రకంలో గతంలో నిపా వైరస్ ఆశ్రయం పొందినట్లుగా రుజువైందని పేర్కొంది. ఈ క్రమంలో కేరళ, హిమాచల్ ప్రదేశ, తమిళనాడు, పుదుచ్చేరిలోని గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిళ్లలో దాదాపు అన్నీ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపింది. (‘ఆ రెండు జన్యుక్రమాలు సరిపోలాయి’)
ఇక తెలంగాణ సహా కర్ణాటక, చండీగడ్, గుజరాత్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లోని గబ్బిలాల్లో నెగటివ్ వచ్చినట్లు స్పష్టం చేసింది. మొత్తం 25 రకాల గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించగా కేవలం ఈ రెండింటిలోనే కరోనా ఉన్నట్లు గుర్తించామంది. ఈ మేరకు తన అధ్యయనంలో పలు కీలక విషయాలు పొందుపరిచింది. కాగా బీటీకోవ్(బ్యాట్ కరోనా వైరస్)గా వ్యవహరిస్తున్న ఈ వైరస్ వల్లే మనుషుల నుంచి మనుషులకు సోకుతున్న కరోనా ఉద్భవించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని జాతీయ వైరాలజీ సంస్థ ప్రగ్యా యాదవ్ పేర్కొన్నారు. (కరోనా: 5 నిమిషాల్లో పాజిటివ్.. 13 నిమిషాల్లో నెగటివ్)
‘‘పలు వైరస్‌లకు గబ్బిలాలు ఆశ్రయజీవులుగా ఉంటాయి. వాటిలో కొన్ని మానవులకు తీవ్రమైన హాని చేస్తాయి. భారత్‌లో టెరోపస్ గబ్బిలాలు గతంలో నిపా వైరస్ వ్యాప్తికారకాలుగా వ్యవహరించినట్లు వెల్లడైంది. కాబట్టి కోవిడ్-19 వ్యాప్తిలో ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటి కారణంగానే కరోనా విస్తరిస్తోందని కచ్చితంగా చెప్పలేం’’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment