తప్పుడు మ్యాపులకు మోహన్ భగవత్‌ను జైల్లో పెడతారా?
న్యూఢిల్లీ: భారత దేశ నైసర్గిక సరిహద్దులను మ్యాపుల్లో ఆన్‌లైన్‌లోగానీ, ముద్రణాపరంగాగానీ తప్పుగా చూపించినట్లయితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల నుంచి వంద కోట్ల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించేందుకు వీలుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించిన విషయం తెల్సిందే. మరి అఖండ్ భారత్ లేదా అవిభాజ్య భారత్ చిత్ర పటాన్ని ఆది నుంచి ప్రదర్శిస్తూ వస్తున్న ఆరెస్సెస్‌ను ఈ కొత్త బిల్లు కింద శిక్షిస్తారా? ఆరెస్సెస్ నాయకుడు మోహన్ భగవత్‌ను అరెస్ట్‌చేసి జైల్లో పెడతారా?
అఖండ్ భారత్ బ్యాక్‌డ్రాప్‌గా భారత మాతా చిత్రపటాన్ని ఆరెస్సెస్ తన అధికార మ్యాప్‌గా పరిగణిస్తున్న విషయం తెల్సిందే. ఆరెస్సెస్ మ్యాపుల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలిపి భారత్ మ్యాప్‌ను చూపిస్తోంది. కొన్ని చిత్రాల్లో అఫ్ఘానిస్తాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక దేశాలను కూడా చూపిస్తోంది. కొత్త బిల్లు చట్టంగా మారితే అధికార బీజేపీకి అండగా నిలుస్తున్న ఆరెస్సెస్ కూడా నేరానికి పాల్పడినట్లు కాదా?
జమ్మూ కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో కలిపి భారత్ మ్యాప్‌లను ఆన్‌లైన్‌లో చూపిన కారణంగా ఈ బిల్లును తీసుకరావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది. పశ్చిమ జమ్మూ కశ్మీర్‌లోని సగ భాగం వాస్తవానికి పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. ఆ ప్రాంతం మన ఆధీనంలో ఉన్నట్లు మన మ్యాపుల్లో చూపించుకుంటున్నాం. అలాగే, ఈశాన్యంలోని అక్సాయి చిన్ ప్రాంతం చైనా ఆధీనంలో ఉన్నది. అది కూడా మన ఆధీనంలో ఉన్నట్లుగా మ్యాపుల్లో చూపించుకుంటున్నాం. మన ఆధీనంలో లేని ప్రాంతాలను మన మ్యాపుల నుంచి తొలగిస్తే కొత్త చట్టం కింద శిక్షిస్తారా? ఆరెస్సెస్‌ను శిక్షిస్తారో, లేదోగానీ వాస్తవ మ్యాపులను రూపొందిస్తే మాత్రం కచ్చితంగా శిక్షిస్తారని ప్రభుత్వ ధోరణి చూస్తే అర్థం అవుతుంది.