
అసవరమైతే మళ్లీ సర్జికల్ దాడులు చేస్తాం: ఆర్మీ
''నియంత్రణ రేఖను మన సైన్యం దాటింది.. అవతలకు వెళ్లి మరీ సర్జికల్ దాడులు నిర్వహించింది.. అవసరమైతే మరోసారి ఇలాంటి దాడులు చేస్తుంది''... అని రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘానికి భారత సైన్యం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సర్జికల్ దాడులకు సాక్ష్యాలు చూపించాలంటూ కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఆర్మీ తొలిసారిగా కొందరు ఎంపీలకు ఈ మొత్తం విషయమై వివరాలు తెలియజేసింది. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత డీజీఎంఓ రణ్‌బీర్ సింగ్ మీడియాతో మాట్లాడిన తర్వాత తొలిసారిగా ఈ అంశంపై ఆర్మీ స్పందించడం విశేషం. భారత సైన్యం వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ స్వయంగా వచ్చి.. కమాండో ఆపరేషన్ వివరాలు చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, జమ్ము కశ్మీర్‌లో కొన్ని లక్ష్యాలపై దాడులు చేయనున్నారని స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాతే మన సైన్యం దాడులకు దిగిందన్నారు. సర్జికల్ దాడులు ఒక్కసారే చేస్తున్న చర్య అని, అయితే భవిష్యత్తులో కూడా అవసరమైతే మరోసారి దాడులు చేయాల్సి ఉంటుందని భారతీయ డీజీఎంఓ పాకిస్థానీ డీజీఎంఓకు చెప్పారని కూడా లెఫ్టినెంట్ జనరల్ రావత్ వివరించారు.
వాస్తవానికి ఈ భేటీ జరుగుతుందని ఒకసారి.. మళ్లీ వాయిదా పడిందని ఇంకోసారి చెప్పడంతపో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దాంతో లెఫ్టినెంట్ జనరల్ రావత్ స్వయంగా వచ్చి.. ఎంపీలను కలిసి మొత్తం వివరాలు వాళ్లకు తెలిపారు. ఆపరేషన్ ఎలా సాగిందో వివరించి, ఉగ్రవాద శిబిరాలకు ఎంత నష్టం వాటిల్లిందో కూడా చెప్పారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భారతీయ సైనికులంతా సురక్షితంగా తిరిగి వచ్చారని కూడా తెలిపారు. ఆత్మరక్షణ చర్యలలో భాగంగానే ఈ ఆపరేషన్ నిర్వహించామని అన్నారు.
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద ఉగ్రవాద దాడితో పాటు ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారనే వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని సమగ్రంగా చర్చించి.. ఆ తర్వాతే ఈ ఆపరేషన్‌కు ప్లానింగ్ మొత్తం చేశామన్నారు. అయితే సునిశిత వివరాలను మాత్రం ఎంపీలకు తెలియజేయలేదు. లెఫ్టినెంట్ జనరల్ రావత్ చెప్పిన విషయాలతో స్థాయీసంఘంలోని చాలా మంది సభ్యులు సంతృప్తి చెందడంతో.. ఇక ఎవరూ ప్రశ్నలు మాత్రం వేయలేదని సంఘం చైర్మన్ బీసీ ఖండూరీ తెలిపారు.